Jul 19,2023 21:12

విలేకర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఘర్షణలపై టిడిపి జిల్లా అధ్యక్షులు చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఖండించారు. స్థానిక వైసిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇంటి ఆక్రమణ విషయంలో బాధితులు చల్లా సుబ్బారావును ప్రశ్నిస్తే తిరిగి వారిపై దాడులు చేసి వివాదానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు దాడి చేస్తున్న వీడియోలలో వచ్చిన ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. టిడిపి దాడులను ప్రతిఘటించేందుకు సిద్ధమైన వైసిపి వారిని అడ్డుకొని పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లాలని తాను ఆదేశించినట్లు చెప్పారు. పట్టణానికి చెందిన ఒక వ్యక్తి రూ.15 కోట్లకు పైగా ఐపి పెడితే వారి ఆస్తులు అమ్మి ప్రతి బాధితునికి 70 శాతం పంపిణీ చేశామన్నారు. కొల్లా సాంబశివరావు చేసిన ఆరోపణలో నిజం లేదన్నారు. ఘటనకు కారణమైన ఇంటిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని బాధితులు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. దాడి ఘటనలో స్వయంగా డాక్టర్‌ చదలవాడ కర్ర తీసు కొని దాడిలో పాల్గొనడం తగదన్నారు. ఘర్షణలకు పాల్పడిన వారు ఏ పార్టీవారైనా నిష్పక్షపాతంగా కేసులు నమోదుకు ఎస్పీకి సూచించామని అయితే పోలీసు వ్యవస్థ పైనే టిడిపి ఆరోపణలు సరికాదని అన్నారు. టిడిపి హయాంలో నరసరావుపేట మండలంలోని కాకానినికి చెందిన ఒక కేసు విషయంలో 15 కుటుంబాలను గ్రామంలో కూడా రానివ్వలేదని అన్నారు. మంగళవారం రాత్రి టిడిపి కార్యాలయంలో టిడిపి నాయకులు చల్లా సుబ్బారావుపై ఆ పార్టీ ముఖ్య నేతలు దాడి చేయగా ఆయన డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు వద్ద చికిత్స పొందుతున్నారని చెప్పారు.