శ్రీవల్లి పది సంవత్సరాల పిల్ల. ఆ వీధిలో ఓ పాకలో నివసిస్తోంది. తన చుట్టూ అన్నీ పెద్ద భవంతులే. వాళ్ళ ఇళ్ళల్లో పాచి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది సరస్వతమ్మ. అనారోగ్యంతో భర్త చనిపోతే కుటుంబ పోషణ భారం, శ్రీవల్లి పెంపకం సరస్వతమ్మపై పడింది. ఆ చుట్టూ ఐదారు ఇళ్లల్లో పనిచేస్తే అరకొర ముట్టేది. జీతం పెంచమని ఎప్పుడూ అడగలేదు. దాదాపు పది సంవత్సరాల నుంచి ఆ ఇళ్లల్లో పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకుంది సరస్వతమ్మ.
ఆ రోజు సంక్రాంతి పండగ. విపరీతమైన చలి ఉంది. జ్వరం వచ్చి ఏ ఇంటి పనికీ వెళ్లలేదు. అందరూ ఎదురుచూసి సరస్వతమ్మ ఇంటికి వచ్చి వాకబు చేశారు.
జ్వరంతో మంచాన పడి ఉంటే, 'పండగరోజు పనికి రాలేదు. గంపెడు అంట్లున్నారు! ఎప్పుడు వస్తావు?' అని అంటున్నారే కానీ 'డాక్టర్ దగ్గరకు వెళ్లావా? ముందు ఆరోగ్యం చూసుకో, డబ్బు ఏమైనా అవసరమైతే అడుగు' అని ఒక్కరూ చెప్పలేదు. సరస్వతమ్మ పక్కనే దిగాలుగా కూర్చుంది శ్రీవల్లి. విసనకర్రతో ఊపుతూ, నుదుటి మీద చెయ్యి వేసింది. కాలి పోతా వుంది. 'అమ్మా! డాక్టర్ దగ్గరకు వెళదాం రావే' అంది. 'వద్దు ఉట్టి జ్వరం ఏమి చేస్తుంది? ఆ డబ్బాలో జ్వరం మాత్ర ఉంది ఇవ్వు!' అంది. ఆ మాత్ర ఇచ్చింది శ్రీవల్లి. కాసేపటికి నిద్రలోకి జారిపోయింది సరస్వతమ్మ.
మరుసటి రోజు సంక్రాంతి. అందరూ ఇళ్ల ముందు రంగు రంగుల రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. ముగ్గు మధ్యలో గొబ్బెమ్మల అలంకరణ కొత్త శోభను ఇస్తోంది.
తన ఇంటిముందు అలాంటి ముగ్గు వేసి, గొబ్బెమ్మను పెట్టుకోవాలని ఆశ పడింది శ్రీవల్లి.
ఆ గొబ్బెమ్మల వైపు చూస్తూ అలానే ఉండిపోయింది. అమ్మ పిలిచేసరికి 'వస్తున్నా' అంది. 'జ్వరం తగ్గింది ఫర్వాలేదు' అంది సరస్వతమ్మ. 'ఈ రెండురోజులు విశ్రాంతి తీసుకో, ఏ పనికీ పోనక్కర్లేదులే' అంది శ్రీవల్లి. 'సరేలేవే బైట నీళ్లు చల్లి, ముగ్గు పెడతావా?' అంది. 'ఓ' అంటూ తలూపింది శ్రీవల్లి.
ఇంటిముందు నీళ్లు చల్లి, తనకు వచ్చీరాని ముగ్గు, ఉన్నంతలో బాగానే వేసింది. కానీ ఏదో లోపం కనపడింది. మధ్యలో గొబ్బెమ్మ లేకపోవడంతో నిరాశపడింది. వెంటనే గొబ్బెమ్మ కోసం తన తల్లి పనిచేసే ఇంటివాళ్ళని 'ఓ గొబ్బెమ్మ ఇవ్వండి!' అని బతిమలాడింది. అందరూ ముఖం చిట్లించి, 'మీ అమ్మ మంచి సమయంలో పనికిరాలేదు, గొబ్బెమ్మా లేదు, గిబ్బెమ్మా లేదు' అని కసురుకున్నారు. ఆ మాటకు ఏడుపొచ్చినంత పనైంది శ్రీవల్లికి.
ఎలాగైనా గొబ్బెమ్మ పెట్టాలని ఆ వీధి అంతా తిరుగుతోంది. ఓ చోట గుడిసె ముందు కొందరు చిన్నారులు గొబ్బెమ్మలు పెడుతూ కనిపించారు. వాళ్లను చూడగానే కళ్లు మెరిశాయి శ్రీవల్లికి. వారి దగ్గరకు వెళ్ళి 'నాకో గొబ్బెమ్మ ఇవ్వరా?' అని అడిగింది.
ఆ పిల్లలు శ్రీవల్లిని చూసి 'ముగ్గు వేశావా?' అన్నారు. తలూపింది శ్రీవల్లి. ఓ చిన్నమ్మాయి గొబ్బెమ్మ తీసి 'ఇందా' అంటూ శ్రీవల్లికి ఇచ్చింది. ఆ గొబ్బెమ్మను తీసుకుని, ఆనందంతో ఇంటికి వచ్చింది. తను వేసిన ముగ్గు మధ్యలో గొబ్బెమ్మను ఉంచి పూలు చల్లింది. అదంతా సరస్వతమ్మ చూసి 'గొబ్బెమ్మ ఎవరిచ్చారే?' అని అడిగింది.
'నువ్వు పనిచేసే ఇళ్ళల్లో ఎవరిని అడిగినా ఇవ్వలేదు. పక్క వీధిలో గుడిసెలో ఉన్న ఓ చిన్నపిల్ల ఈ గొబ్బెమ్మను ఇచ్చింది' అంది సంతోషంగా.
సరస్వతమ్మ మంచంలో నుంచి లేచి నిట్టూర్చి, 'ఆ గొప్పింటి వాళ్ల కంటే పేద పిల్లలే నయం. వాళ్లకున్న సహృదయం వీళ్లకు లేదు' అని గొబ్బెమ్మను సరిజేయమని చెప్పింది.
శ్రీవల్లి ఆ రంగవల్లి మధ్యలో గొబ్బెమ్మను అటూ ఇటూ మారుస్తుంటే అలానే చూస్తూ ఉండిపోయింది సరస్వతమ్మ.
* కనుమ ఎల్లారెడ్డి, 93915 23027