ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన తర్వాత ఈనెల 26న తొలిసారిగా గణతంత్ర వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా పోలీసులు వారం రోజుల నుంచి ముమ్మర తనిఖీలు చేపట్టారు. గణతంత్ర దిన వేడుకలకు జిల్లా కేంద్రం పాడేరులోని తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల మైదానాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వేదిక పక్కనే జిల్లా అధికారులు, నాయకులు కూర్చునేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల నుంచి సైనిక వందనాన్ని స్వీకరిస్తారు. జిల్లా ప్రగతిని, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రసంగించనున్నారు. ప్రభుత్వ ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలియజేసేందుకు ప్రభుత్వ విభాగాల వారీగా స్టాల్స్‌ను సిద్ధం చేశారు. విద్యార్థులు నిర్వహించే సాంస్కతిక కార్యక్రమాలు, మాక్ డ్రిల్‌తో పాటు సాయుధ పోలీసు దళాల కవాతుకు అనుకూలంగా మైదానాన్ని తీర్చిదిద్దారు. వీటితో పాటు జిల్లా ప్రగతి, అభివృద్ధిని అమలు చేస్తున్న కార్యక్రమాలు తెలియజేసేలా వివిధ శాఖలకు చెందిన అధికారుల పర్యవేక్షణలో శకటాల ప్రదర్శనకు సిద్ధం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగుల సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను అందజేస్తారు. బుధవారం విద్యార్థులు మాక్ డ్రిల్, డ్యాన్స్ రిహార్సల్స్ చేశారు.
గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన..
తలారిసింగి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల మైదానంలో బుధవారం గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను డిఇఒ రమేష్, టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు పరిశీలించారు. వేదిక, సిట్టింగ్, స్టాల్స్, శకటాలు తదితర ఏర్పాట్లను పాఠశాల హెచ్‌ఎం రీమలి జాన్‌ను అడిగి తెలుసుకున్నారు.










