Jan 17,2023 22:54

మాట్లాడుతున్న పిఒ గోపాలకృష్ణ

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌:
ఈనెల 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు. ఐటిడిఎ కార్యాలయం .బి.ఆర్‌. అంబేద్కర్‌ సమావేశ మందిరంలో జెసి జె.శివ శ్రీనివాసుతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో స్థానిక అలారిసింగి గిరిజన సంక్షేమ ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై శకటాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వీటి రూపకల్పనతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సహకార సంస్థ. పౌర సరఫరాలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ, కాఫీ విభాగం, డిఆర్‌డిఎ, అగ్నిమాపక శాఖల ఆధ్వర్యంలో ప్రగతి శకటాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఐసిడిఎస్‌, గిరిజన సహకార సంస్థ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పటిష్టంగా ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని పిఒ సూచించారు. ఈ సమావేశంలో ఐటిడిఎ సహాయ ప్రాజెక్టు అధికారి విఎస్‌ ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ శాఖ డిడి ఐ.కొండలరావు, డిఇఒ పి.రమేష్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బిఎస్‌ నంద్‌, జిల్లా ఉద్యాన వన అధికారి రమేష్‌ కుమార్‌రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.