Jul 10,2023 00:10

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కూరగాయల సాగు పెరగడంలేదు. ఏటా ఆరు నెలలు ధరలు పెరగడం, ఆరు నెలలు గణనీయంగా తగ్గడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం టమోటా రూ.120, పచ్చి మిర్చి రూ.100 వరకు పలుకుతున్నాయి. మిగతా కూరగాయలన్నీ కిలో రూ.30 నుంచి రూ.50 వరకు పలుకుతున్నాయి. రాజధాని ఆవిర్భావానికి ముందు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 10 వేల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగేది. రాజధానికి రైతుల నుంచి ప్రభుత్వం భూములు తీసుకోవడంతో ఈ ప్రాంతంలో సాగు నిలిచిపోయింది. రాజధాని పరిసర గ్రామాల్లో ఐదేళ్లక్రితం భూముల విలువపెరగడంతో చాలా మందిసాగు నుంచి ఉపసంహరించుకుని తమ భూములను వ్యాపారులకు విక్రయించడంతో సాగు విస్తీర్ణం మరింత తగ్గింది. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో వివిధ రకాల కూరగాయలు పండించే వారు. డెల్టాలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల కూడా కూరగాయల ఉత్పత్తి సరిగా జరగడం లేదు. మొత్తంగా గతంలో ఉమ్మడి జిల్లాలో 30 వేల ఎకరాల్లో కూరగాయాల సాగు జరిగేది. ప్రస్తుతం గుంటూరుజిల్లాలో 2022-23లో 5600 ఎకరాల్లోనే కూరగాయల సాగు జరుగుతోంది. పల్నాడు జిల్లాలో నాలుగు వేల ఎకరాల్లో సాగు అవుతోంది.
జిల్లాలో ఒకప్పుడు క్యారెట్‌, బెండ,దొండ, టామాట, క్యాబేజి,కాలీఫ్లవర్‌, వంగ, పచ్చి మిర్చి, కంద, పెండలం, పొట్లకాయలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి. కూరగాయల సాగు దారులకు అమ్మడబోతే అడవి...కొనబోతేకొరవి అన్న చందంగాపరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్పత్తులు చేతికి వచ్చినప్పుడు వ్యాపారులు సిండికేట్‌ అయి కిలోరూ.2నుంచి రూ.5లోపు కొనే వారు.రైతు బజార్లకు రైతులే తెచ్చుకుని విక్రయించుకోవాలన్న అధికారుల దయా దాక్షిణ్యాలపై ఉంటుంది. ఒక్కొసారి బెండ, దొండ, వంకాయి,క్యాబేజి వంటి కూరగాయలు కోసేందుకు అయ్యే కూలి కన్నా రైతులకు దక్కె ధర బాగా తక్కువగా ఉండేది. రవాణాఛార్జీలు తడిసిమోపెడు అవుతున్నాయి.రైతులు నేరుగా పొలం నుంచి ఆటోల్లో రైతు బజార్లకు వచ్చినప్పుడు కిలోరూ.10 నుంచి 15లోపు ధరలు నిర్ధేశించే వారు. దీంతో చాలా మంది సాగు మానేశారు. అంతేగాక ఆకాల వర్షాలు, అధిక వర్షాలతో తోటలు దెబ్బతినడం పరిపాటైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ చివరినుంచి మే 8 వరకు అకాల వర్షాలతో ఆకుకూరల తోటలు దెబ్బతిన్నాయి. బాపట్ల నుంచి గతంలో పచ్చిమిర్చి జిల్లా మొత్తం సరఫరా అయ్యేది.ఈ ప్రాంతంలో సాగు,దిగుబడి తగ్గడంతో ఇప్పుడు ఇతర బెంగుళూరు నుంచి తెప్పిస్తున్నారు. దీంతో ధర కిలో రూ.100కు పెరిగింది.
గతంలో ఉమ్మడి కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చే కూరగాయలు ఇప్పుడు పూర్తిస్థాయిలో రావడంలేదు. ఉద్యాన శాఖ కూడా కూరగాయల సాగుకు రైతులను ప్రోత్సహించడం లేదు. విసీర్ణం పెంపుపై శ్రద్ధ కొరవడింది. గతంలో మిద్దెలపై కూరగాయల సాగును ప్రోత్సహిస్తామని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు చేసిన ప్రకటనలు ఆరంభశూరత్వంగా మిగిలాయి. ఎగువ మధ్యతరగతి వారు భారీగా పెట్టుబడి పెట్టి తమ డాబాలు, అపార్టుమెంట్స్‌ ఎగువ భాగంలో మిద్దెసాగు ప్రారంభించినా శ్లాబులు దెబ్బతింటున్నాయని చాలా మంది అర్ధాంతరంగా ఉపసంహరించుకున్నారు.