ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : జిల్లా పరిధిలో జరుగుతున్న గణేష్ నిమజ్జనలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రదేశాల వద్ద ఎటువంటి అపశ్రుతులు దొర్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు వారి పరిధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను తనిఖీ చేసి వారి నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా నిమజ్జనం చేస్తారనే ే సమాచారాన్ని కలిగి ఉండాలన్నారు. నిమజ్జనం చేసే ప్రదేశాల్లోని అన్ని చోట్ల అవసరమైన సిబ్బందిని కేటాయించి, బారికేడ్లు, జాగ్రత్త నియమావళి బానర్లు ఏర్పాటు చేయాలని, నిమజ్జన ప్రాంతంలో లైటింగ్ వెలుతురులో చేయాలని సూచించారు. ఈత గాళ్లను అందుబాటులో ఉంచుకొని నిమజ్జనం ప్రాంతంలో పిల్లలు, వృద్ధులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిఘా ఉంచాలన్నారు. నిమజ్జనం యాత్ర జరిగే రహదారులు, కూడళ్ల వద్ద పటిష్ట బందోబస్తుతో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జనాలు పూర్తి జరిగేలా చూడాలని, లైఫ్ జాకెట్లు, నాటు పడవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ అదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ స్టేషన్ అధికార్లు నిమజ్జనం జరిగే ప్రదేశాల వద్ద అవసరమైన బారికేడ్లు, జాగ్రత్త నియమావళి బానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ సభ్యులతో మాట్లాడి నిమజ్జనం సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.










