ప్రజాశక్తి - టి.నరసాపురం
మండలంలోని అప్పలరాజు గూడెం గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థి గణేష్ అంజనాసాయి అమెరికా పర్యటనకు ఎంపిక కావడం హర్షణీయమని పాఠశాల ప్రిన్సిపల్ డిఎస్‌బి శంకరరావు ఆదివారం తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో పాఠశాలలో విద్యనభ్యసించిన గణేష్ అంజనాసాయి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 581 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరచినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 52 మందిని ఎంపిక చేసి, వారిని వివిధ దశలలో పరీక్షించి, పది మందిని మాత్రమే అమెరికా పర్యటనకు ఎంపిక చేశారన్నారు. ఆ పదిమంది విద్యార్థుల్లో గణేష్ అంజనాసాయి ఎంపికయ్యారని తెలిపారు. యూఎస్‌ఎ ప్రోగ్రాంకు వెళ్లిన వారు తొమ్మిది రోజులు పాటు అమెరికాలో వివిధ విషయాలు పరిశీలించి వచ్చేందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. గణేష్ అంజనాసాయి భవిష్యత్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.










