ప్రజాశక్తి - హోళగుంద
హోళగుందలో గంటపాటు భారీ వర్షం కురిసింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రెండు గంటల పాటు మండలంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తాగునీరు, చిన్న పరిశ్రమలపై ఆధారపడిన కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలివానకు మామిడికాయలు నేలపాలైనట్లు రైతులు వాపోయారు. ఈ వర్షం వల్ల పొలాల్లో విత్తనాలు వేసుకుంటామని కొంతమంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెలరోజులుగా పొలాలను చదును చేసుకొని విత్తనాలు సిద్ధం చేసుకుని రోహిణి కార్తీలో విత్తనాలు వేయాలనుకున్న రైతులకు ఈ వర్షం మేలు చేసింది. మృగశిర కార్తీలో వర్షం కురవడంతో విత్తనాల వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ వర్షం మామిడి రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిలిచ్చింది. జిల్లాలో 20 రోజులుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినా ఇక్కడ మాత్రం ఇదే మంచి వర్షమని రైతులు పేర్కొంటున్నారు. గంట పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పిడుగులు ఎక్కడ పడతాయోనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
గ్రామంలో నిలిచి ఉన్న వర్షపు నీరు










