Jun 08,2023 00:00

దుప్పట్లు పంపిణీ చేస్తున వీరభద్రరావు

ప్రజాశక్తి-గొలుగొండ:విప్లవ వీరుడు, అల్లూరి సీతారామరాజుకు ప్రధాన అనుచరుడు, విప్లవ సేనాని గాం గంటం దొర 99వ వర్ధంతి సందర్భంగా బుధవారం మండలంలోని కృష్ణదేవిపేట అల్లూరి స్మారక మందిరంలో ఘనంగా నివాళ్లు అర్పించారు. జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు గంటందొరకు పూలమాల వేశారు. అల్లూరి, గంటందొరల సమాధుల వద్ద జ్యోతి వెలిగించారు. దేశ స్వాతంత్య్రం కోసం అతి చిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు, అతని ప్రధాన అనుచరుడిగా గాం గంటం దొర సారధ్యంలో అల్లూరి సేన బ్రిటిష్‌ పాలకులపై చేసిన సాయుధ పోరాటం చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుందని పడాల వీరభద్రరావు అన్నారు. అనంతరం సుమారు 20 మంది మహిళలకు, అల్లూరి పార్కు సంరక్షకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన గంటందొర చిత్రపటాన్ని సంఘం ఇంచార్జ్‌ అధ్యక్షుడు పీవీ.సత్యనారాయణరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి శ్యామల వరలక్ష్మి, కార్యవర్గ సభ్యుడు వరహాల బాబు పాల్గొన్నారు.