డిఐజి హరికృష్ణ
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఏజెన్సీలో గంజాయి రవాణా, గంజాయి సాగుపై ఉక్కు పాదం మోపినట్లు డిఐజి ఎస్.హరికృష్ణ అన్నారు. శుక్రవారం ఏజెన్సీలో పలు పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌లో తనిఖీ నిర్వహించి రికార్డులు పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గంజాయి తోటలు సాగు ప్రాంతాలను గుర్తించి వాటిని ధ్వంసం చేస్తామన్నారు. గంజాయి వల్ల కలిగే అనర్ధాలు గురించి సాగుదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గంజాయి సాగు చేస్తున్న భూముల్లో ప్రత్యామ్నాయంగా నిమ్మ, సపోటా, రాగిలా, కాఫీ, పసుపు వంటి పంటలను సాగు చేసుకునేలా ప్రొత్సహించడం జగుతుందని చెప్పారు. ఇందు కోసం 90శాతం సబ్సిడీపై అన్ని సమకూర్చడం జరుగుతుందన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవనం, ఉపాధి హామీ శాఖల ద్వారా అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన యువత చెడు మార్గాలు పట్టకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రేరణ కార్యక్రమం ద్వారా జిల్లాలో 70 మందిని ఎంపిక చేసి టాటా ట్రస్ట్ ద్వారా శిక్షణకు తమిళనాడు పంపించడం జరిగిందని చెప్పారు. శిక్షణ అనంతరం వారికి ఉద్యోగ కల్పన ఉంటుందన్నారు. ఆడపిల్లల కోసం నర్సింగ్‌లో అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మావోయిస్టుల ప్రభావం అంతగా ఏమీ లేదన్నారు. డిఐజి వెంట అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, రంపచోడవరం ఇన్‌ఛార్జి ఎఎస్‌పి మహేంద్ర రెడ్డి, రాజవొమ్మంగి సీఐ ఆర్.రవి కుమార్, ఎస్‌ఐ టీజీ నరేంద్ర ప్రసాద్, ఏపిఎస్పి బెటాలియన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు.










