Jul 09,2023 00:28

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ కాకినాడ పోర్ట్‌ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు ఇటీవల జరిపిన తనిఖీల్లో ఒక వ్యక్తి 40 కేజీల గంజాయిని నాలుగు ట్రాలీ బ్యాగుల్లో రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. ఇతను కాకినాడ నుంచి బీహార్‌, మహారాష్ట్ర ఇతర ప్రాంతాలకు గంగజాయి తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
కాకినాడ గంజాయికి అడ్డాగా మారిందని మాజీ ఎంఎల్‌ఎ కొండబాబు ఇటీవల ఆరోపణలు చేయడంతో పాటు ఎక్కడ నుంచి సరఫరా చేస్తున్నారనే విషయాలపై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పారు. దీంతో కాకినాడ పోలీసులు ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలసుకుని కాకినాడలో పలు ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్టు ఎస్‌పి తెలిపారు.
రెండేళ్లుగా కాకినాడలో గంజాయి అమ్మకాలు, కొనుగోళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నా వాటికి బలం చూకూరుస్తూ ఎప్పటికప్పుడు గంజాయి కేసులు నమోదవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ నగరంలో ఎన్ని కేసులు నమోదు చేసినా గంజాయి అమ్మకాలు, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా, ఏమాత్రం తగ్గడం లేదని ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా గానీ గంజాయి మాత్రం కాకినాడకు యథేచ్చగా వస్తుంది.
పోలీసులు చెబుతున్న వాదన ఇదీ
కాకినాడలో గంజాయి ప్రధానంగా వినబడడానికి కారణం ముఖద్వారం మన జిల్లా అవడమేనని పోలీసులు అంటున్నారు. ఏజెన్సీ నుంచి వచ్చే గంజాయిని తీసుకునేందుకు, అంతర రాష్ట్ర ముట్టాలతో పాటుగా, గంజాయి అమ్మేవారు కూడా, ప్రధాన ల్యాండ్‌ మార్క్‌ అన్నవరం గుడిని చూపిస్తున్నారని, అక్కడ నుంచి రైలు మార్గాల ద్వారా ఇతర మార్గాల ద్వారా గంజాయి రవాణా సాగుతోందని గుర్తించామని పోలీసులు అంటున్నారు. వీరందరూ తప్పనిసరిగా కాకినాడ వచ్చి అక్కడి నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయి ఈశాన్య రాష్ట్రాలకు అధికంగా ఎగుమతి అవుతోందని సమాచారం. తమిళనాడు, కేరళ, గోవా, మహారాష్ట్ర, ఢిలీ తదితర రాష్ట్రాలకు కూడా విరివిగా సరఫరా అవుతోంది. ఆయా రాష్ట్రాలకు సరుకు చేర్చడానికి స్మగ్లర్లకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మినహా మరోప్రత్యామ్నాయ మార్గం లేదు. అందుకే చింతూరు- రంపచోడవరం- రాజమహేంద్రవరం రూటు, పాడేరు-చింతపల్లి-నర్సీపట్నం-తుని మార్గాల్లో అధికంగా రవాణా చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో తుని మీదుగా గంజాయి రవాణా రకరకాల మార్గాల్లో వెళ్తోందని పోలీసులు భావిస్తున్నారు.
గంజాయి సాగు.. ప్యాకింగ్‌
గంజాయి పంటను వేసిన తర్వాత కొన్ని నెలలపాటు సంరక్షిస్తారు. పంట పూర్తయిన తర్వాత దాన్ని కోస్తారు. అక్కడికి దగ్గర్లోనే ఎండబెట్టి ప్యాకింగ్‌కు సిద్ధం చేస్తున్నారు. 10 గ్రాములు, 50 గ్రాములు, 500 గ్రాములు, 1 కిలో, 5 కిలోలు, 25 కిలోలు, 50 కిలోలుగా ప్యాకింగ్‌ చేస్తున్నారు. ఆ సరుకును మైదాన ప్రాంతాలకు వివిధ రూపాల్లో తరలిస్తున్నారు. వాహనాల్లో ఏదో ఒక సరుకుల మాటున ఈ ప్యాకెట్లు పెడుతున్నారు. పోలీసుల తనిఖీల్లో కొన్నిచోట్ల తప్పించుకున్నా ఎక్కడోచోట దొరికేస్తున్నారు. ఇటీవల తెలివి మీరి గంజాయిని లిక్విడ్‌గా చేసి కూడా రవాణా చేయడం ప్రారంభించారు. ఈ తరహా లిక్విడ్‌ గంజాయిని గతేడాది కాకినాడ పోలీసులు పట్టుకున్నారు.
మూడు మార్గాల్లో రవాణా
ఎఒబి నుంచి మూడు ప్రధాన మార్గాల ద్వారా గంజాయి రవాణా జరుగుతోంది. ఇందులో మల్కాన్‌గిరి ముఖ్యమైనది. రూట్‌1 : మల్కాన్‌గిరి- సీలేరునది- డొంకరాయి-చింతూరు-భద్రాచలం మీదుగా విజయవాడ వైపు వెళ్తోంది. రూట్‌ 2: మల్కాన్‌గిరి- సీలేరునది- డొంకరాయి-చింతూరు- మారేడుమిల్లి- రంపచోడవరం మీదుగా రాజమండ్రివైపు వెళ్తోంది. రూట్‌ 3: కోరాపుట్‌-పాడేరు-నర్సీపట్నం- తుని హైవే మీదుగా కాకినాడ వెళ్తోంది. ఇలా హైవేలు, రైలు మార్గాల ద్వారా గంజాయి దేశవ్యాప్తంగా సరఫరా అవుతోంది.
గంజాయి రకాలు
గంజాయిలో శీలావతి, రాజహంస, కాలపత్రి ప్రధాన రకాలు. ఎఒబిలో శీలావతి రకం సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ రకం అక్కడ కిలో రూ.4 వేలు, రూ.8 వేల మధ్య ఆదివాసీల నుంచి కొంటారు. ఎపిలోని ప్రధాన నగరాల్లో దీని రూ.60 వేల వరకు ఉంది. దేశవ్యాప్తంగా పెద్ద నగరాల్లో కిలో రూ.లక్ష పలుకుతోంది. ఇటీవల కాకినాడ జిల్లాలో 46 కేసులు నమోదు కాగా 146 మందిని అరెస్టు చేశారు. 8,227 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
దారి తప్పుతున్న యువత
గంజాయి వ్యసనం యువతను దారి మళ్లిస్తోంది. ఉన్నత లక్ష్యాలను గురి తప్పేలా చేస్తోంది. మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్ధి దశ నుంచే కొందరు బానిసలవడం కలవరపెడుతోంది. మత్తు మాపియా వీరిని పావులుగా వాడుకుంటోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై దృష్టి సారించామని ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా.. గంజాయి నిల్వలు తగలబెడుతూ మత్తు రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులు (ఏవోబీ) తోపాటు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం నుంచి గంజాయి నిల్వలు తరలివస్తున్నాయి.