Jun 15,2023 23:49

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ, ముసుగులో నిందితులు

ప్రజాశక్తి-తెనాలి : కళాశాల విద్యార్థులు, ఆటో డ్రైవర్లే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దర్ని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ బి.జనార్ధనరావు చెప్పారు. స్థానిక రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో వివరాలను విలేకర్లకు డీఎస్పీ గురువారం వెల్లడించారు. సంగంజాగర్లమూడికి చెందిన మహ్మద్‌ అబ్తుల్‌ రషీద్‌ అలియాస్‌ రషీద్‌ పదేళ్లుగా వ్యసనాలకు బానిపై 2012 నుంచే దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఆ సొమ్ముతో జల్సాలకు అలవాటు పడ్డాడు. తెనాలి ఒన్‌టౌన్‌, టూటౌన్‌, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్లతో పాటు పలు పోలీసు స్టేషన్లలో రషీద్‌పై కేసులున్నాయి. 2021లో టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌పరిధిలో ఏడు కిలోల గంజాయి పట్టుబడిన కేసులోనూ రషీద్‌ నిందితుడు. బైక్‌ చోరీ కేసులో అరెస్టయిన రషీద్‌ గుంటూరు జైల్లో ఉండగా అతనికి వైఎస్సార్‌ జిల్లా లోతుగడ్డ ప్రాంతానికి చెందిన గంజాయి కేసులో నిందితుడు సాయి అలియాస్‌ వంటల నాగేంద్రతో పరిచయమైంది. ఆ పరిచయంతో గంజాయి విక్రయానికి రషీద్‌ తెరతీశాడు. ఈ నేపథ్యంలో సాయి నుంచి గంజాయిని కిలో రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి, రూ.15 వేలకు విక్రయిస్తూ జల్సా చేస్తున్నాడు. ఇటీవల కాలంలో సాయి నుంచి ఐదు కిలోల గంజాయిని కొనుగోలు చేసిన రషీద్‌కు, రూరల్‌ గ్రామం పెదరావూరుకు చెందిన గంజాయికి బానిసైన కోటంరాజు కామేశ్వరరావుద అలియాస్‌ కాశితో పరిచయమైంది. అతనికి కిలో గంజాయిని విక్రయించాడు. మరో కిలో గంజాయి కావాలంటూ రషీద్‌కు కాశి ఫోన్‌ చేశాడు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న రూరల్‌ సిఐ కె.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ సిహెచ్‌ వెంకటేశ్వర్లు నిఘా పెట్టారు. రెండు సంచుల్లో కిలో చొప్పున గంజాయి విడివిడిగా ప్యాక్‌ చేసుకుని సంగంజాగర్లమూడి లాకులు తూర్పు వైపునకు రషీద్‌ వచ్చాడు. అనంతరం కాశీకా ఫోన్‌ చేసి పిలిపించుకున్నాడు. వారిద్దరూ అక్కడికి చేరుకోగానే సమీపంలో మాటు వేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.21 వేల విలువైన 2.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మూడో ముద్దాయిగా ఉన్న సాయి అలియాస్‌ వంటల నాగేంద్రను అరెస్ట్‌ చేయాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు. నిందితులు గంజాయిని విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. గత మూడు నెలల వ్యవధిలో రూరల్‌ పరిధిలో నాలుగు గంజాయి కేసులు నమోదు చేసి, ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. సమావేశంలో రూరల్‌ సిఐ కె.శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ సిహెచ్‌ వెంకటేశ్వర్లు, హెడ్‌ కానిస్టేబుల్‌ పి.మణికుమార్‌, టి.శ్యామలరావు, పిసిలు పి.శ్రీనివాసులు, ఎం.రాము పాల్గొన్నారు.