Jul 22,2023 23:48

పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్‌పి

ప్రజాశక్తి- మేదరమెట్ల : గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు. వార్షిక తనిఖీలో భాగంగా కోరిశపాడు పోలీసు స్టేషన్‌ను ఎస్‌పి శనివారం సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌పి మాట్లాడారు. గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ఆరు నెలల లోపు 200 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారు ఇప్పటికీ రిమాండ్‌లోనే ఉన్నారన్నారు. గంజాయిని ఒరిస్సా నుంచి మన రాష్ట్రంలోని అడవి ప్రాంతానికి తీసుకువచ్చి కొంతమంది ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారిపై సస్పెక్ట్‌ షీట్‌ దాఖలు చేస్తామని తెలిపారు. గంజాయి తాగే వారిని అదుపులోకి తీసుకొని ఎక్కడ కొన్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడ దొరుకుతుంది అనే అంశాలను విచారణ చేస్తామన్నారు. మద్యం బెల్ట్‌ షాపులపై కూడా దాడులు జరిపిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే రహదారిపై డమ్ములు ఏర్పాటు చేసి స్టిక్కర్లు అంటించినట్లు తెలిపారు. గతంతో పోల్చితే ప్రస్తుతం ప్రమాదాల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ట్రాఫిక్‌ సిబ్బందితో పాటు కొంత పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. అద్దంకిలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం సిగల్‌ లైట్స్‌కు ప్రపోజల్‌ పెట్టినట్లు తెలిపారు. త్వరలో లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. నేరాలు, దొంగతనాల గురించి పోలీస్‌ సిబ్బందితో చర్చించి చర్చించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి ఎస్‌. ప్రసాదరావు, ఎస్‌బిఐ ఇన్‌స్పెకట్ఱ శ్రీనివాస్‌, అద్దంకి సిఐ యు. ఉమేష్‌, కొరిశపాడు ఎస్‌ఐ జివి. చౌదరి, ఎస్‌పి సిసి హరికష్ణ పాల్గొన్నారు.