ప్రజాశక్తి -సీలేరు
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.... ముందస్తు సమాచారం మేరకు జీకే వీధి మండలం సీలేరు ఏపీ జెన్కో చెక్‌పోస్టు వద్ద పోలీస్ సిబ్బంది శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. దారకొండ వైపు నుంచి తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారును సీలేరు జెన్కో చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఆ కారులో 10 కేజీలు గంజాయిని గుర్తించారు. గంజాయితో పాటు నిందితుల నుంచి 2 సెల్ ఫోన్లు, రూ.650 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కె.రాకేష్, మణిదీక్షిత్, విక్రమ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నవారు, సహకరించిన వారిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్‌ఐ తెలిపారు.










