ప్రజాశక్తి -సీలేరు
పర్యాటకం ముసుగులో సీలేరు మీదుగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ మంగళవారం వెల్లడించారు. ఎస్‌ఐ కథనం ప్రకారం... శని ఆదివారాల్లో పర్యాటకం పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యువకులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు స్థానిక ఏపీ జెన్కో చెక్ పోస్ట్ వద్ద సోమవారం పోలీసులు మాటు వేసి వాహన తనిఖీలు చేశారు. ఈ మార్గంలో వస్తున్న టిఎస్‌ఎఫ్‌డబ్ల్యు 6042 నెంబర్ గల మారుతి సుజుకి బెలూన్ కారును చెక్ పోస్టు వద్ద ఆపి తనిఖీ చేశారు. దీంతో అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించి, కారులో ఉన్న నలుగురు యువకులను అదుపులో తీసుకొని విచారించారు. వారి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఒకరు బీటెక్ విద్యార్థిగా గుర్తించారు. వారి నుంచి 4 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కారు సీజ్ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఒకరు జీకే వీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ చల్లని శిల్ప గ్రామానికి చెందిన బి.కున్ను కాగా, మిగిలిన యువకుల్లో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గండికోట లక్ష్మి సాయి, గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన చెట్టుపు చంద్రశేఖర్ రెడ్డి, పల్నాడు జిల్లా నరసరావుపేట నిమ్మతోటకి చెందిన షేక్ అహ్మదు ఉన్నారు. గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా పెట్టామని, పట్టుపడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్‌ఐ హెచ్చరించారు.










