- గిరిజనులకు ఎఎస్‌పి పిలుపు
ప్రజాశక్తి -సీలేరు
గిరిజనులు గంజాయి పంటలకు స్వస్తి పలికి సాంప్రదాయ పంటలపై దృష్టి సారించాలని చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పిలుపునిచ్చారు. జీకే వీధి మండలం దారకొండలో బుధవారం ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గుమ్మరేవులు గాలికొండ, దారకొండ, దుప్పిలివాడ, సీలేరు పంచాయతీ ప్రజలు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎఎస్పీ మాట్లాడుతూ గంజాయి సాగు, అక్రమ రవాణా నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, దానికి గిరిజనులు సహాయ సహకారాలు అందించారని కోరారు. చింతపల్లి, దారకొండ, సీలేరు ప్రాంతాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారితో రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. అయితే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుంచి అక్రమంగా తరలివెళ్లిన గంజాయి హైదరాబాదు ఇతర రాష్ట్రాల్లో పట్టుబడితే దారకొండ, గుమ్మరేవులు, సీలేరు ప్రాంతాల నుంచి గంజాయి వెళ్తుందని పేరు వినపడటం బాధాకరమన్నారు. అందుకే గిరిజనులు గంజాయి సాగు అక్రమ రవాణా పూర్తిస్థాయిలో విడనాడి సాంప్రదాయ పంటలను సాగు చేస్తే తాము సహకారం అందిస్తామని తెలిపారు. గిరిజనులు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని రాయితీలు వచ్చే విధంగా కృషి చేస్తామని గిరిజనులకు ఎఎస్పీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు పంచాయతీల గిరిజనులకు 20వేల జీడి మామిడి మొక్కలను పంపిణీ చేశారు. రాజ్‌మా విత్తనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జికె.వీధి సీఐ అశోక్ కుమార్, సీలేరు ఎస్సై రామకృష్ణ, జీకే వీధి తహశీల్దారు ప్రసాద్, డిప్యూటీ తహశీల్దారు కుమారస్వామి, జీకే వీధి ఎంపీపీ కుమారి, దారకొండ సర్పంచ్ నడిగట్ల రాజు పాల్గొన్నారు.










