ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండలంలో లక్ష్మీపురం, బుంగాపుట్టు పంచాయతీ గ్రామాలలో స్థానిక ఎస్సై రవీంద్ర గురువారం సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులతో ఆయన మాట్లాడుతూ, గంజాయి సాగు చట్టరీత్యా నేరమని, తరలింపులో సహాయం చేసినా, ఫైలెట్ వాహనాలలో తరలించినా చర్యలు తప్పవన్నారు. గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో పోలీసులు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు గిరిజనులందరికి చేరేలా గ్రామ వాలంటరీర్లు చూడాలన్నారు.బిర్రిగూడ గ్రామంలో విద్యుత్ సమస్య నెలకొందని తక్షణమే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. సంగంవలస గ్రామస్తులు మాట్లాడుతూ, గ్రామం నుండి ప్రధాన రహదారి వరకు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఘరం గ్రామస్తులు తాగునీటి కోసం బోరు, సెల్ టవర్ నిర్మాణం చేపట్టాలని కోరారు. బొర్రమామిడి గ్రామస్తులు సిసి రోడ్డు నిర్మాణం, బంగాపుట్టు, బొర్రమామిడి గ్రామస్తులు కొబ్బరి, సిల్వర్, కాఫీ మొక్కలు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గ్రామస్తులకు మందులు, పిల్లలకు చాక్లెట్లు, యువతకు వాలీబాల్ కిట్‌లు పంపిణీ చేశారు.










