Jun 29,2023 00:12

పట్టుబడిన గంజాయి విక్రేతలతో పోలీసులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా కరస్పాండెంట్‌ : గంజాయిని అమ్ముతున్న ఆరుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు కారును సీజ్‌ చేశారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో బుధవారం వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, డీఎస్సీ కెవి మహేష్‌ పర్యవేక్షణలో టూటౌన్‌ సిఐ వీరేంద్రబాబు ఆధ్వర్యంలో ఎస్‌.ఐ రహంతుల్లా, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. నరసరావుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన ముత్తుపాటి అమర్‌, చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలేనికి చెందిన మర్రి చిన్నకోటేశ్వరరావు, యడ్లపాడు మండలం తిమ్మాపురానికి చెందిన జంగా నరేంద్ర, వాసిమల్ల జాషువా డానియేల్‌, విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన నెమలి వీరబాబు, విశాఖ జిల్లా మాడుగుల మండలం నుర్మతి పంచాయతీకి చెందిన వాంకుడోత్‌ బాలాజీ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో విస్తృత సోదాలు, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని పోలీస్‌ అధికారులను పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశించారు. లాడ్జీల్లో అనుమానిత వ్యక్తుల వివరాలను పొలీసులకు తెలపాలన్నారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిఘా పెట్టామని, నాటు సారాయి తాయారు చేసి అమ్ముతున్న 17 మందిపై పీడీ యాక్టు అమలు చేసి జైలకు పంపించడం వల్ల నాటు సారాను జిల్లాలో నిర్మూలించామని చెప్పారు. రెండ్రోజుల క్రితం గంజాయి అమ్ముతూ 3 కేసులు ఉన్న దుర్గి మండలానికి చెందిన మహిళపై పీడీ యాక్ట్‌ అమలు చేసి జైలుకు పంపిచినట్లు తెలిపారు. మత్తుపదార్ధాలకు అలవాటుపడిన వారిని గుర్తించి, డి-అడిక్షన్‌ సెంటర్లలో కౌన్సెలింగ్‌ ఇప్పించడం, అక్రమరవాణా, విక్రయాలు చేసే వారిలో పరివర్తన కార్యక్రమం ద్వారా మార్పు తేవడం వంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు తెలిపారు. గంజాయి విక్రేతలను అదుపులోకి తీసుకున్న పోలీస్‌ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.