Oct 29,2021 06:33

గంజాయి సాగు నియంత్రణకు, యువత మత్తు, మాదకద్రవ్యాల వినియోగం పైపు వెళ్లకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. గంజాయి సాగు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు పండించడానికి అనువైన నేల మన్యంలో వుంది. వాణిజ్య పంటల వైపు గిరిజనులను మళ్లించేందుకు తొలిదశలో విత్తనాలు, మొక్కలు, పెట్టుబడులకు ఆర్థిక సహాయం, నీటి వసతి కల్పించాలి. హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్‌, కర్నాటకలో పండించే స్ట్రాబెర్రీకి అనువుగా వున్న ఏజెన్సీలో స్ట్రాబెర్రీ... అలాగే యాపిల్‌, డ్రాగన్‌ఫ్రూట్‌ పంటలను ప్రోత్సహించాలి.

    కప్పుడు మావోయిస్టులకు రక్షణ కవచంగా వున్న ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఎఒబి) ప్రాంతం ఇప్పుడు గంజాయి సాగుకు అడ్డాగా ఎందుకు మారింది ? దేశ, విదేశాల్లో గంజాయి వ్యాపార విస్తరణకు విశాఖ కేంద్రంగా ఎలా తయారైంది ?
    తెలుగు రాష్ట్రాల్లోనూ, రాష్ట్రంలో రాజకీయ దుమారానికి గంజాయి సాధనం కావడంతో ఇప్పుడిది చర్చనీయాంశమైంది. దాదాపు పదిహేనేళ్ల క్రితం విశాఖ మన్యంలో సాగుగా లేని గంజాయి నేడు పది వేల ఎకరాలకు విస్తరించడానికి ప్రభుత్వాల పాపిష్టి విధానమే కారణం. గంజాయి సాగంతా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరగడంతో వారివైపు గిరిజనులు ఆకర్షితులు కాకుండా, తొలుత ఆదాయం వైపు వీరి ఆలోచన మళ్లేలా గంజాయి సాగు పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాయి. ప్రస్తుతం మావోయిస్టు ప్రాబల్యం మన్యంలో కాస్త తగ్గినా, గంజాయి సాగును నియంత్రించే చర్యలు చేపట్టడంలేదు.
     ఈ వికృత వ్యూహం ఫలితంగానే విశాఖ మన్యంలోని 11 మండలాల్లో అరకు, అనంతగిరి మినహా ముంచంగిపుట్‌, పెదబయలు, డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జి.కె వీధి, కొయ్యూరు మండలాల్లోని ఏఒబిలో దాదాపు వెయ్యి గ్రామాల్లోని పదివేల ఎకరాల్లో గంజాయి సాగవుతుంది. పదివేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి విలువ మార్కెట్లో రూ. రెండు వేల కోట్లకు పైగా వుంటుందని అధికారులు భావిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాగవుతున్న గంజాయిని ధ్వంసం చేయడానికి భద్రతాపరమైన ఇబ్బందులు, రవాణా సమస్యలున్నాయని పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి గంజాయి సాగుతో గిరిజనులు పొందే లబ్ధి కంటే వివిద రాజకీయ పలుకుబడి వున్న వ్యక్తులు, వ్యాపారులు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. మన్యంలో తిష్టవేసి, మార్కెట్‌లో గిరాకీ వున్న శీలావతి గంజాయి సాగు పట్ల మెళకువలు గిరిజనులకు నేర్పించి, రవాణాకు వారిని ఉపయోగించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
     ఇక్కడ కూడా గిరిజనులను గంజాయి వ్యాపారులు మోసగిస్తున్నారు. సాంప్రదాయ వ్యవసాయ పంటల ద్వారా ఎకరాపై వచ్చే ఇరవై, ఇరవై ఐదు వేల రూపాయలకు అదనంగా మరో పది వేల రూపాయలు చెల్లించి మిగిలిన సొమ్మంతా తీసుకొని గంజాయి వ్యాపారులు లబ్ధి పొందుతున్నారు. ప్యాకెట్ల లోని గంజాయి దొరికిపోతుందని తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ద్రవరూపంలో తయారు చేయించి బాటిళ్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్యాకెట్ల లోని గంజాయిని పసిగట్టి పట్టుకొనే డాబర్‌మెన్‌ తెగకు చెందిన కుక్కలను పోలీసులు రంగంలోకి దించితే వ్యాపారులు గంజాయిని ద్రవరూపంలో తయారుచేసి విక్రయించే ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్నారు. గంజాయి కేసుల్లో అత్యధిక మంది గిరిజనులు పట్టుబడి జైళ్ల పాలవుతుండగా, వ్యాపారులు దొరక్కుండా లాభాలు సంపాదిస్తున్నారు. గంజాయి మత్తుకు యువత అలవాటు పడ్డమే కాదు. ఉన్నత చదువులు చదువుకొని ఉపాధి లేని నిరుద్యోగులను రవాణాకు ఉపయోగించుకోవడంతో గంజాయి రవాణాలో వారు దొరికిపోతున్నారు.
     వాస్తవానికి గంజాయి సాగును నిర్మూలించే శక్తి సామర్ధ్యాలు ప్రభుత్వానికీ, పోలీసులకూ లేక కాదు. మావోయిస్టుల ఏరివేతకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ డిజిపిలతో సమావేశమై సంయుక్త కూంబింగ్‌ ఆపరేషన్లు నిర్వహించిన ప్రభుత్వాలకు గంజాయి సాగు నిర్మూలన పెద్ద సమస్యే కాదు. అత్యంత ఆధునిక ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా వున్న పోలీసులు తలచుకుంటే గంటల్లో సాగును ధ్వంసం చేయగలరు. ఒక దశలో శాటిలైట్‌ ఇమేజ్‌, డ్రోన్లు ఉపయోగించి గంజాయి సాగును ధ్వంసం చేయాలని పోలీసులు భావించారు. ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో రవాణా మార్గాల్లో గంజాయి రవాణా చేసిన వారిని పట్టుకోవడానికే పోలీసులు పరిమితమవుతున్నారు.
    గంజాయి సాగు, వ్యాపారాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా చూడకూడదు. దేశంలో నల్లమందు తరువాత అత్యధికంగా గంజాయికి అలవాటు పడుతున్నారు. దేశంలో గంజాయికి అలవాటుపడ్డవారు రెండున్నర కోట్ల మంది వుంటారని అంచనా. ఉత్తరప్రదేశ్‌, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి వినియోగం అధికంగా వుంది. ఈ రాష్ట్రాలకు విశాఖ మన్యం నుంచి గంజాయి వివిధ మార్గాల్లో చేరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గంజాయికి అలవాటు పడ్డవారిలో ఇంజనీరింగ్‌, విశ్వవిద్యాలయ విద్యార్థులున్నట్లు అధికారుల విచారణలో బయటపడింది. అంతర్జాతీయ మాదకద్రవ్య నియంత్రణ మండలి (ఐఎన్‌సిబి) మూడేళ్ల క్రితం విడుదల చేసిన వార్షిక నివేదికలో గంజాయి లభ్యత భారతదేంలో ఎక్కువగా వుందని పేర్కొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా విస్మరించ వీల్లేనిదిగా గుర్తించింది. మత్తుకు అలవాటు పడ్డ వ్యక్తుల మెదడు, నాడీ మండల వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మత్తు వినియోగం పెరిగినకొద్దీ శరీరభాగాలపై దుష్ప్రభావం చూపి, చివరకు ప్రాణాంతకం అవుతుంది. విచక్షణ కోల్పోయి నేర ప్రవృత్తికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
    ఇంతటి ప్రమాదకరమైన గంజాయి పట్ల ప్రభుత్వాలు చురుకైన పాత్ర పోషించడం లేదు. గంజాయి సాగు నియంత్రణకు, యువత మత్తు, మాదకద్రవ్యాల వినియోగం పైపు వెళ్లకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. గంజాయి సాగు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు పండించడానికి అనువైన నేల మన్యంలో వుంది. వాణిజ్య పంటల వైపు గిరిజనులను మళ్లించేందుకు తొలిదశలో విత్తనాలు, మొక్కలు, పెట్టుబడులకు ఆర్థిక సహాయం, నీటి వసతి కల్పించాలి. హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్‌, కర్నాటకలో పండించే స్ట్రాబెర్రీకి అనువుగా వున్న ఏజెన్సీలో స్ట్రాబెర్రీ...అలాగే యాపిల్‌, డ్రాగన్‌ఫ్రూట్‌ పంటలను ప్రోత్సహించాలి.
     సేంద్రీయ పద్ధతుల్లో లభ్యమవుతున్న గిరిజనుల అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులైన తేనె, చింతపండు, పసుపు, అల్లం, కాఫీ, క్యాబేజీ వంటి పలు పంటలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల సాగుకు, అటవీ వ్యవసాయోత్పత్తులు కొనుగోలుకు ప్రభుత్వం చొరవ చూపాలి. వ్యాపారులు, మధ్యవర్తుల పాత్ర లేకుండా ప్రభుత్వ ఏజెన్సీలు, జిసిసి, ఐటిడిఎ ద్వారా పంటలు కొనుగోలు చేయించి గిరిజనులకు స్థిరమైన ఆదాయం లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే గంజాయి సాగు విరగడవుతుంది. సమాజ హితాన్ని, మానవాళి శ్రేయస్సును కోరుకొనేవారెవరైనా కాలం వెళ్లదీసే కబుర్లు ఆపి, గంజాయిని నివారించే చర్యలకు ఉపక్రమించాలి. అప్పుడే ప్రయోజనం వుంటుంది. గంజాయి నిర్మూలనకు ప్రభుత్వపరంగా గ్రామ స్థాయిలో వున్న వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొనే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. చిత్తశుద్ధితో నిర్మూలనకు కృషి చేయాలి.

/ వ్యాసకర్త - ప్రజాశక్తి ప్రతినిధి, విశాఖపట్నం /

జి. కాంతారావు