ప్రజాశక్తి-తెనాలి : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని డీఎస్పీ బి.జనర్ధానరావు హెచ్చరించారు. స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గంజాయి కేసులో అరెస్ట్ చేసిన నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. రైల్వే స్టేషన్ వెనుక నున్న గూడ్స్ షెడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో త్రీటౌన్ సిఐ బి.రమేష్‌బాబు ఆదివారం రాత్రి దాడి చేశారు. అ సమయంలో అక్కడ గంజాయి విక్రయిస్తున్న, గంజాయి సేవిస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారిలో పాండురంగపేటకు చెందిన షేక్ నాగుర్ బాబు అలియాస్ నాగూర్, చెంచుపేటకు చెందిన కటికల శ్రీను అలియాస్ బంకు శ్రీను, చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన మన్నూరి ఏడుకొండలు అలియాస్ కిట్టు, షేక్ అబ్దుల్ రెహమాన్ అలియాస్ హన్ను, సింహాద్రి పూర్ణచంద్ అలియాస్ పూర్ణ, షేక్ ఖాజా అలియాస్ అమ్ము ఖాజా, షేక్ కరిముల్లా అలియాస్ పండు ఉన్నారు. నిందితుల్లో ఒకరైన నాగూర్ బాబు వ్యసనాలకు బానిసై, గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి, మిగిలిన పై ఆరుగురికి విక్రయించాడు. వారంతా అక్కడే గంజాయి సేవిస్తున్న క్రమంలో పోలీసులు దాడి చేశారు. నిందితుల నుంచి రూ.62 వేల విలువైన 1240 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు కోర్టుకు హాజరు పరుస్తామని డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సిఐ బి.రమేష్‌బాబు, ఎస్‌ఐలు విజరుకుమార్, అహ్మద్ బాషా, కానిస్టేబుల్స్ ఎం.అంకయ్య, కె.రంజిత్ కుమార్, కె.చిరంజీవి పాల్గొన్నారు.










