Aug 08,2023 23:19
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-చీరాల: ప్రభుత్వ నిషేధిత గంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అమ్మినవారు, కొన్నవారు, సహకరించిన వారందరిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తుందని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. చీరాల ప్రాంతంలో గంజాయి క్రయ విక్రయాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును డిఎస్పి ఆధ్వర్యంలో రూరల్‌ పోలీసులు రట్టు చేశారు. 9 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ విషయంపై మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మీడియాతో మాట్లాడారు. గంజాయిపై జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోందని పటిష్ట నిఘాతో గంజాయి కేసులోని 9 మంది నిందితులను అరెస్టు చేసి వారిని రిమాండుకు తరలించామని అన్నారు. చీరాల రూరల్‌ సీఐ మల్లికార్జునరావుకు గంజాయి రవాణా అమ్మకాల గురించి వచ్చిన విశ్వాసనీయ సమాచారం మేరకు రూరల్‌ సీఐ మల్లికార్జునరావు ఎస్‌ఐ పి జనార్దన్‌ సిబ్బందితో కలిసి కావూరివారిపాలెం సమీపంలో యదల మ్మ చెట్టు వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ కొందరు వ్యక్తులు పోలీసుల రాకను గమనించి పారిపోయేందుకు యత్నించగా సిబ్బంది అప్రమత్తమై పరారవుతున్న యువకులలో జీవన్‌ కుమార్‌, విజరు కుమార్‌ అలియాస్‌ టింకు లను అదుపులోకి తీసుకొని విచారిం చారు. స్టువర్టుపురానికి చెందిన తిమోతి అనే వ్యక్తి గంజాయిని సునీల్‌ దగ్గర నుంచి తీసుకొని వచ్చి వారితో అమ్మకాలు జరిపేవారని అతను అందుబాటులో లేకపోవడంతో సునీల్‌ను సంప్రదించగా గంజాయి సరఫరాదారులు బోగిరి ప్రదీప్‌, పూజారి ప్రేమ్‌చంద్‌, మట్ర శ్రావణ్‌ కుమార్‌లు ముగ్గురు వెదుళ్లపల్లి ఘటనలో ప్రస్తుతం జైలులో ఉన్నారని, వారి నుంచి సేకరించి ఉంచిన 23 కేజీల గంజాయిని సునీల్‌ తీసుకువచ్చి ఇచ్చారని అందులో కొంత గంజాయిని మిగిలిన గంజాయి వారి వద్ద ఉన్నట్లు చెప్పారని తెలిపారు. వారి వద్ద ఉన్న 21 కేజీల గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. ఆపాటికే పారిపోయిన పలువురి కోసం గాలిస్తుండగా శివారెడ్డి రొయ్యల చెరువు వద్ద కొందరు యువకులు పారిపోవటాన్ని గమనించి అప్రమత్తమై వానపల్లి అజరుకుమార్‌, కోటా శ్రీరాములు, పసల బాలస్వామి మొగిలిశెట్టి శేషు, మా స్వామి, బల్లాని శివశంకర్‌, కాశీ సాయి ఈశ్వర తేజ, కర్రెద్దుల ప్రవీణ్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. వారు సేవించేందుకు కొనుగోలు చేసిన సుమారు రెండున్నర కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. మొత్తంగా తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేయగా చీరాలకు చెందిన సునీల్‌, స్టువర్ట్‌ పురానికి చెందిన చిత్తూరు తిమోతి పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల నుంచి సుమారు రూ.2.35 లక్షల విలువగల 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించినట్లు తెలిపారు. డిఎస్‌పి ఎస్‌ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో చీరాల రూరల్‌ సిఐ ఏ మల్లికార్జునరావు, చీరాల రూరల్‌ ఎస్సై పి జనార్ధన్‌, చీరాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది, హెడ్‌ కానిస్టేబుల్స్‌ వెంకయ్య, పిచ్చియ్య, పోలీస్‌ కానిస్టేబుల్స్‌ కపారావు, నాగాంజనేయులు, భాస్కర్‌రావు, నాగరాజు, హౌంగార్డు శ్రీనివాసరావు సహాయంతో పై గంజాయి కేసులోని నిందితులను అరెస్ట్‌ చేశారు. గంజాయి కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌