ప్రజాశక్తి -గాజువాక : అదాని గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గంగవరం పోర్డు ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షులు కొవిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. అదాని గంగవరం పోర్టు యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా నిర్వాసిత కార్మికులు చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలు మంగళవారం నాటికి 22వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కొవిరి అప్పలరాజు మాట్లాడుతూ, కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లపై యాజమాన్యంతో పలుదపాలు సంప్రదింపులు జరిపినప్పటికీ మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గంగవరం పోర్టులో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ కింద మరో బోగస్ కంపెనీని యాజమాన్యం రిజిస్ట్రేషన్ చేయించుకుని జిపిఎఫ్ పేరుతో కార్మికుల శ్రమను దోచుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని సంప్రదింపులు ద్వారా కార్మికుల వేతనాలు పెరిగేలా కృషి చేయాలని కోరారు. 52 మంది కార్మికుల బృందం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసేందుకు విజయవాడ వెళ్లారని, వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చి కార్మికుల గోడు వినాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసుపిల్లి యల్లాజి, కొవిరి అమ్మోరు, రాజారావు తదితరులు పాల్గొన్నారు.










