ప్రజాశక్తి -గాజువాక : అదాని గంగవరం పోర్టు యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా నిర్వాసిత కార్మికులు చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలు ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) బృందం సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు పి.మణి మాట్లాడుతూ, అదానీ గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. గంగవరం పోర్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన నిర్వాసిత కార్మికుల జీతభత్యాలు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. జీతాలు పెంచమని కోరితే కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమన్నారు. అదాని యాజమాన్యం కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడి వారి సమస్యలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించాలని కోరారు. లేకుంటే పోరాటం మరింత ఉధృతమవుతుందని, ఈ పోరాటంలో తామూ ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పారు
గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావు మాట్లాడుతూ, అదాని గంగవరం పోర్టు యాజమాన్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండ చూసుకొని కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. నోటీసులు పంపించి భయపెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. న్యాయమైన కోర్కెలు పరిష్కరించకపోతే ఉద్యమం మరింత తారాస్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు. కనీస జీతం రూ.36 వేలు ఇవ్వాలని, బేసిక్ రూ.22 వేలుగా ప్రకటించాలని, అన్యాయంగా విధుల నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు స్టీల్ జోన్ ప్రధాన కార్యదర్శి కొవిరి అప్పలరాజు, యూనియన్ నాయకులు వాసుపిల్లి ఎల్లాజీ, గంటిపిల్లి అమ్మోరు, మాద అప్పారావు, పేర్ల నూకరాజు, కదిరి సత్యానందం, గంటిపిల్లి లక్ష్మయ్య, కొవిరి అమ్మోరు తదితరులు పాల్గొన్నారు.










