Jul 29,2023 23:51

దీక్షలో కూర్చున్న కార్మికులు

ప్రజాశక్తి- గాజువాక : అదాని గంగవరం పోర్టు యాజమాన్యం తక్షణమే కార్మికు సమస్యలు పరిష్కరించాలని 64వ వార్డు కార్పొరేటర్‌ దల్లి గోవిందరెడ్డి డిమాండ్‌ చేశారు. పోర్టు యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా నిర్వాసిత కార్మికులు చేపట్టిన నిరవదిక నిరసన దీక్షలు శనివారం నాటికి 26వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా 64వ వార్డు కార్పొరేటర్‌ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ, పోర్టు నిర్మాణం కోసం భూములు, సముద్రాన్ని త్యాగం చేసిన నిర్వాసిత కార్మికులు చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీస జీతం రూ.36 వేలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. అదాని గంగవరం పోర్టు యాజమాన్యం సంప్రదింపులు ద్వారా నిర్వాసిత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు స్టీల్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావు వాసుపల్లి ఎల్లాజీ గంటిపిల్ల అమ్మోరు, మాధ అప్పారావు, కదిరి సత్యానందం, గంటిపిల్లి లక్ష్మయ్య, నొల్లి స్వామి, పేర్ల నూకరాజు తదితరులు పాల్గొన్నారు.