ప్రజాశక్తి -గాజువాక : అదాని గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తాతారావు చెప్పారు. అదాని గంగవరం పోర్టు కార్మికుల చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం నాటికి 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని కలిసేందుకు ఐదుగురికి అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే నాగిరెడ్డి చెప్పినా దొరకలేదన్నారు. అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో సమస్యను తెలిపేందుకు కార్మికులు ఎయిర్‌పోర్టు వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తే 11 మందిని పోలీసులు నిర్బంధించి, ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాత విడిచి పెట్టారని తెలిపారు. సమస్యను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్లు కనబడుతోందని పేర్కొన్నారు. అందుకే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు మాదా అప్పారావు, కదిరి సత్యానందం, కదిరి సత్తయ్య, రాజు పాల్గొన్నారు.










