ప్రజాశక్తి-గాజువాక : గంగవరం పోర్టు కార్మికుల ఆత్మహత్యలను ఆపాలని, కనీస వేతనం రూ.36 వేలు ఇవ్వాలని అఖిలపక్ష రాజకీయ, కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌చేశారు. గాజువాకలోని ఎస్‌బిటి హోటల్‌లో ఆదివారం అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, గంగవరం పోర్టు యాజమాన్యం షాప్స్ అండ్ ఎన్టీప్లేస్మెంట్ ప్రకారం జీతాలు ఇస్తున్నామని చెబుతున్నారని తెలిపారు. అయితే పోర్టు షాపు కాదని, విదేశాల నుంచి కార్గో హాండ్లిండ్ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. డాలర్లల్లో లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో జీతాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గంగవరం పోర్టు భారీ పరిశ్రమ కాబట్టి ప్రత్యేక వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని, లేకుంటే పక్కనే ఉన్న వైజాగ్ పోర్టులో మాదిరిగా జీతాలు చెల్లించాలని డిమాండ్‌చేశారు.
కార్మికులు ఉద్యోగంలో చేరి 14 సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ కనీసం 3 ప్రమోషన్లు ఇవ్వాలని తెలిపారు. కానీ ఒక్కరికి కూడా ప్రమోషన్ ఇవ్వలేదన్నారు. ఏటా పోర్టు లాభాల్లో నడుస్తోందని, వచ్చిన లాభాల్లో 20 శాతం బోనస్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నష్టాల్లో వున్న సరే కనీసం ఒక నెల జీతం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అలా కాకుండా ముష్టివేసినట్లు బోనస్ ఇస్తున్నారని విమర్శించారు. పోర్టులో గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే రిజిస్ట్రేషన్ అయి ఉందని, యూనియన్‌లో మెజార్టీ సభ్యులు ఉన్నారని చెప్పారు. గుర్తింపు యూనియన్‌గా గుర్తించి, చర్చలు జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి యాజమాన్యాం కృషి చేయాలని కోరారు.
గంగవరం పోర్టులో 14 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న కార్మికులకు రూ.13 వేలు నుంచి రూ.16 వేలు, 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు రూ.9 వేలు నుంచి రూ.9,800 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఉద్యోగంలో చేరినప్పుడు ఇచ్చిన రూ.3700 బేసిక్ మాత్రమే ఇప్పటికీ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. గంగవరం పోర్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసిత ఉద్యోగులు పేరుకే పర్మినెంటు తప్ప, జీత బత్యాలు దారుణంగా ఉన్నాయని తెలిపారు. విశాఖ పోర్టు, స్టీలుప్లాంట్‌లో పర్మినెంటు కార్మికులకు ఇస్తున్న వేతనాల్లో సగం కూడా గంగవరం పోర్టు కార్మికులకు ఇవ్వడం లేదన్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలు, మెమోలు, ఛార్జ్‌షీట్లు ఇస్తూ ఉద్యోగాలు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
డిమాండ్లు
కార్మికులపై అక్రమ కేసుల పెట్టడాన్ని వెనక్కి తీసుకోవాలని, కనీస జీతం రూ.36 వేలు ఇవ్వాలని, అక్రమంగా ఉద్యోగం నుంచి తొలగించిన గంటిపిల్లి లక్ష్మయ్య, కదిరి భూలోకరావు, కారి అప్పారావును విధుల్లోకి తీసుకోవాలని, ఏటా 20 శాతం బోనస్, బోనస్ కనీసం నెల జీతం ఉండాలని, ప్రత్యేక మెడికల్ పాలసీ, మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిఫరల్ హాస్పిటల్ సౌకర్యం ద్వారా హెల్త్ స్కీమ్‌ను ప్రకటించాలని, డ్యూటీకి ఒక గంట ముందు ఒక గంట తర్వాత ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు, అంగవైకల్యం చెందిన కార్మికులకు తక్షణ నష్టపరిహారం ప్యాకేజీని ప్రకటించాలని, వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, జిపిఎల్, జిపిఎస్ మధ్య అంతరాన్ని తొలగించి అందరినీ జిపిఎల్ కార్మికులుగా గుర్తించాలని, జిపిఎస్ కార్మికుల వేతనాల్లో, నిర్వాసిత కార్మికుల పట్ల వివక్షతను తొలగించాలని డిమాండ్‌చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, తిప్పల గురుమూర్తి, చింతలపూడి వెంకట్రామయ్య, స్థానిక కార్పొరేటర్ గోవింద్‌రెడ్డి, శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు కెఎం.శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు సత్యనారాయణ, ఎఐటియుసి నాయకులు ఆదినారాయణ, ఐఎన్‌టియుసి నాయకులు మంత్రి రాజశేఖర్, గంగవరం పోర్ట్ ఎంప్లాయిస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అప్పలరాజు, మాదా అప్పారావు, ఎల్లాజీ, అమ్మోరు,నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా యూనియన్ ప్రధాన కార్యదర్శి తాతారావు అందరికీ స్వాగతం పలికారు.










