Jul 24,2023 00:22

దీక్షా శిబిరంలో కూర్చుని మద్దతు తెలుపుతున్న జగ్గునాయుడు, గిడుగు రుద్రరాజు

ప్రజాశక్తి -గాజువాక : అదాని గంగవరం పోర్టు కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు స్పష్టంచేశారు. అదాని గంగవరం పోర్టు యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా నిర్వాసిత కార్మికులు చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలు ఆదివారం నాటికి 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని జగ్గునాయుడు ఆదివారం సందర్శించి మాట్లాడారు. పోర్టు నిర్మాణానికి భూములు, సముద్రాన్ని త్యాగం చేసిన నిర్వాసితులకు తగిన వేతనాలు చెల్లించమంటే అదానీ యాజమాన్యానికి ఎందుకు చేతులు రావడంలేదని ప్రశ్నించారు. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ పేరుతో అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ కార్మికుల శ్రమను దోచుకోవడం యాజమాన్యం మానుకోవాలన్నారు. అదాని గంగవరం పోర్టు గత సంవత్సరం రూ.2000 కోట్ల మేర టర్నోవర్‌ చేసిందని, రూ.700 కోట్ల నికర లాభాలు వచ్చాయని తెలిపారు. ఇది ఏ రకంగా షాప్‌ అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ కల్పించుకొని జిపిఎస్‌ పేరుతో ఉన్న షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేయాలని కోరారు. గంగవరం పోర్టు కార్మికులకు న్యాయం జరిగే వరకూ అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు అండగా నిలుస్తాయన్నారు. యాజమాన్యం మొండి పట్టు వదిలి సంప్రదింపుల ద్వారా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఈ ఆందోళన మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. కార్మికులు ఏ పిలుపునిచ్చినా సిపిఎం ప్రత్యక్షంగా పాల్గొంటుందని ప్రకటించారు.
కార్మికులకు కాంగ్రెస్‌ మద్దతు : గిడుగు
ఎపి పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కాంగ్రెస్‌ పార్టీ బృందంతో కలిసి శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ఎపి కాంగ్రెస్‌ కమిటీ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్రంలోని బిజెపికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వ వాటాను అదానీకి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కట్టబెట్టారని విమర్శించారు. 30 సంవత్సరాలు తర్వాత పోర్టు ప్రభుత్వ పరం అవుతుందని అప్పటి ప్రభుత్వం చెప్పిందని, దాన్ని విస్మరించి నేటి ముఖ్యమంత్రి అదానీకి అప్పగించడం సరికాదన్నారు. ఆగస్టు నెలలో రాహుల్‌గాంధీ విశాఖపట్నం వస్తున్నారని, ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావు మాట్లాడుతూ, యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ జీతభత్యాలపై స్పష్టత రావడం లేదన్నారు. యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు నిరాకరిస్తుందని తెలిపారు. సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు నిరసన శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు స్టీల్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శి కొవిరి అప్పలరాజు, వాసుపిల్లి ఎల్లాజీ, గంటిపల్లి అమ్మోరు, మాద అప్పారావు, పేర్ల నూకరాజు, గంటిపిల్లి లక్ష్మయ్య, కదిరి సత్యానందం, నొల్లి స్వామి, కొవిరి అమ్మోరు తదితరులు పాల్గొన్నారు.