ప్రజాశక్తి -గాజువాక : గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కోరారు. గంగవరం పోర్టు మొండివైఖరికి నిరసనగా కార్మికులు చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష గురువారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలనుద్దేశించి ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లడుతూ కార్మికుల సమస్యలను అదాని గంగవరం పోర్టు యాజమాన్యం సామరస్యంగా పరిష్కరించాలన్నారు. రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి కో-ఆర్డినేటర్ వైవి.సుబ్బారెడ్డి సమక్షంలో సర్క్యూట్ హౌస్‌లో జాయింట్ మీటింగ్ ఏర్పాటుచేస్తానని చెప్పారు.
టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సముద్రాన్ని సర్వం త్యాగం చేసిన నిర్వాసిత కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ యాజమాన్యం దోచుకుంటుందని విమర్శించారు. 29 మంది కార్మికులను విధుల్లోకి తీసుకుంటేనే చర్చలకు వెళ్లాలని సూచించారు. నిర్వాసిత కార్మికులకు కనీస వేతనం రూ.36 వేలు ఇవ్వాలని, బేసిక్‌లో డిఎ మెర్జ్ చేసి కొత్త బేసిక్ రూ.22 వేలుగా ప్రకటించాలని డిమాండ్‌చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేవరకు ఉద్యమం కొనసాగించాలన్నారు. గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావు మాట్లాడుతూ, యాజమాన్యం కార్మికులను మాత్రమే సంప్రదింపులకు పిలుస్తోందని, అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు లేకుండా వెళ్లేది లేదని చెప్పారు. శిబిరం నుంచి పాత గాజువాక జంక్షన్ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. 71వ వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు, కాంగ్రెస్ నాయకులు జెర్రిపోతుల ముత్యాలు, గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షులు కొవిరి అప్పలరాజు, విశాఖ పోర్టు యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మణరావు నిర్వాసిత కార్మికుల ఉద్యమానికి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కారి దానయ్య, కారి గోపి, పల్లెటి పోలయ్య, దవులుపిల్లి ఎల్లాజి. వాసుపల్లి యల్లాజీ, మాద అప్పారావు, గంటపిల్లి అమ్మోరు, మాద అప్పారావు, కదిరి సత్యానందం, పేర్ల నూకరాజు, నోళ్లు స్వామి, గంటిపిల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.










