
ప్రజాశక్తి- బుచ్చయ్యపేట
గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసే సభ్య రైతులకు ఫ్యాక్టరీ అందించే ఎరువుల పంపిణీ గందరగోళంగా మారింది. గతంలో చెరకు కాటాల ద్వారా సభ్య రైతులకు చెరకు సరఫరా చేసిన అగ్రిమెంట్‌ను బట్టి యూరియా, డీఏపీ, గ్రోమోర్, పొటాషియం తదితర ఎరువులను పంపిణీ చేసేవారు. ఈ ఏడాది చెరకు రైతులకు ఎరువులు పంపిణీ రైతు భరోసా కేంద్రాల చేస్తున్నారు. బుచ్చయ్యపేట చెరకు కాటాకు దిబ్బిడి, బుచ్చయ్యపేట, కందిపూడి, కోవిలపల్లి, ఐతంపూడి, కెపి.అగ్రహారం, కొండపాలెం, పి.భీమవరం తదితర గ్రామాల రైతులు చెరకు సరఫరా చేస్తారు. వీరందరికీ ఈ కాటా దగ్గరే గతంలో ఎరువులు అందించేవారు. ఈ ఏడాది రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. బుచ్చయ్యపేట, దిబ్బిడి, కందిపూడి, కేపీ అగ్రహారం ఆర్‌బికెలకు సొంత భవనాల్లేవు. నిల్వ చేసుకునే విధంగా గొడౌన్లు లేవు. దీంతో చెరకు కాటా గొడౌన్‌లో నిల్వ ఉంచారు. సభ్య రైతులు చెరకు కాటా వద్దకు వెళ్లి ఫీల్డ్‌మెన్ వద్ద ఎరువుల సరఫరాకు అగ్రిమెంటు రాయించుకొని, ఆ అగ్రిమెంట్ పత్రాలను సచివాలయానికి తీసుకొచ్చి చూపించి, అక్కడ నుండి గొడౌన్‌లకు వెళ్లి ఎరువులు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో గంగరగోళం ఏర్పడంతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాక్టరీ సిబ్బంది అయితే రైతుల సమయాన్ని బట్టి ఎరువుల అందిస్తూ ఉంటారని రైతులు తెలిపారు. గతంలో మాదిరిగానే కాటాల ద్వారా చెరకు రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.