Apr 01,2023 21:41

ఫిజిక్స్‌, ఎన్‌ఎస్‌ పరీక్షపై పదో తరగతి విద్యార్థుల ఆందోళన
ఒక పేపర్‌ రాశాకే.. రెండో పేపర్‌ రాస్తేనే మేలంటున్న ఉపాధ్యాయులు
ప్రతి 15 నిమిషాలకోసారి గుర్తు చేయాలనే ఆదేశం అమలయ్యేనా!
ప్రజాశక్తి - భీమవరం

పదో తరగతి విద్యార్థులను ఫిజిక్స్‌, ఎన్‌ఎస్‌ పరీక్షపై గందరగోళం, ఆందోళన నెలకొంది. ఈ పరీక్ష నిర్వహణపై అటు ఉపాధ్యాయుల్లోనూ, ఇటు విద్యార్థుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక పేపర్‌ రాశాకే రెండో పేపర్‌ రాస్తే ఉపయోగకరమని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఈ సబ్జెక్టులో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతి 15 నిమిషాలకోసారి విద్యార్థులకు దీనిపై గుర్తు చేయాలని ఇన్విజిలేటర్లకు విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలొచ్చాయి. అయితే ఇది ఎంతవరకు అమలవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
గతేడాది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది నూతన విభజిత జిల్లాలో పరీక్షలు ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు 376 ఉన్నాయి. అధికారులు 121 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 24,586 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి 121 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 121 మంది డిపార్టుమెంటల్‌ అధికారులు, ఆరు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 24 మంది రూట్‌ అధికారులను నియమించారు.
పదో తరగతి పరీక్షల్లో గతేడాది ఏడు పేపర్లు పెట్టగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో వాటిని ఆరింటికే కుదించి పరీక్షలు నిర్వహించేలా మార్పులు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిజిక్స్‌, నేచురల్‌ సైన్స్‌ (ఎన్‌ఎస్‌)కు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు, వేర్వేరుగా ఆన్సర్‌ బుక్‌లెట్లు ఇస్తారు. దీనిపైనే ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన ప్రీ పబ్లిక్‌ పరీక్షలో ప్రాక్టీస్‌ చేయించినా చాలా స్కూళ్లల్లో విద్యార్థులు ఫిజిక్స్‌ ఆన్సర్‌ బుక్‌లెట్‌లో ఎన్‌ఎస్‌ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు రాశారు. పబ్లిక్‌ పరీక్షలో ఇదే పునరావృతమైతే అంతిమంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. రెండు ప్రశ్నాపత్రాలు, రెండు ఆన్సర్‌ బుక్‌లెట్లు ఒకేసారి ఇస్తారు. దీంతో విద్యార్థులు వారికి ఏ పేపర్‌ తేలిగ్గా ఉందో, దాన్ని ముందుగా రాసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే జవాబులు వేర్వేరు ఆన్సర్‌షీట్లపై రాయాల్సి ఉంది. దీంతో వాటిని రాసే క్రమంలో పొరపాటున ఒక దానిపై రాయాల్సింది మరోదానిపై రాస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుందని, వేర్వేరుగా కాకుండా ఒకే ఆన్సర్‌ బుక్‌లెట్‌లో సమాధానాలు రాసేలా వెసులుబాటు కల్పించాలని ఇప్పటికే ఉపాధ్యాయులు పరీక్షల విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారి నుంచి ఎటువంటి స్పందనా లేదు. పిల్లలకు ఈ నూతన విధానం అలవాటు కావాలని, ఎన్‌ఇసిఆర్‌టి పరీక్షలు రాసేవారు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోలజీ మూడు పేపర్లు విడివిడిగా రాస్తారని, కనీసం మన విద్యార్థులు రెండు పేపర్లయినా రాయకపోతే ఎలా అని చెప్పి పాఠశాల విద్యాశాఖాధికారులు వాదిస్తున్నారు.
సీరియల్‌ నంబరు వేర్వేరుగానే..
సీరియల్‌ నెంబరు ఒకటి నుంచి 16 వరకు ఫిజిక్స్‌, 17 నుంచి 33వ ప్రశ్న వరకూ ఎన్‌ఎస్‌ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పొరపాటున 17వ నంబరు ప్రశ్నకు ఫిజిక్స్‌ సమాధాన పత్రంలో రాస్తే ఆ మేరకు ఇన్వాలిడ్‌గా పరిగణిస్తారు. ఇది లేకుండా ఉండాలంటే 1 నుంచి 16 దాకా ఫిజిక్స్‌ ప్రశ్నావళికి ఆ ఆన్సర్‌ బుక్లెట్‌పైనే రాయాలి. ఎన్‌ఎస్‌కు కేటాయించిన 17 నుంచి 33 నెంబర్లు వరకూ సంబంధిత ఆన్షర్‌ షీట్‌పై సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అయితే విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో తడబడి ఒకదాని బదులు మరో ఆన్షర్‌ షీట్‌లో సమాధానాలు రాస్తే ఆయా సబ్జెక్టుల్లో ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.