Jul 29,2023 22:59

కోతకు గురై గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన తహశీల్దార్‌
ప్రజాశక్తి - ఉంగుటూరు

            రావులపర్రు - కోనాల ఆర్‌అండ్‌బి రహదారి రావులపర్రు నుంచి కాగుపాడు వెళ్లే దారిలో రోడ్డు కోతకు గురై గండి పడిన ప్రాంతాన్ని తహశీల్దారు ఎవి రమణారావు శనివారం పరిశీలించారు. తోకలపల్లి ప్రధాన మురుగు కాలువ, రాచూరు, పత్తేపురం వెళ్లే పంట కాలువ మధ్య నుంచి ఆర్‌అండ్‌బి రోడ్డు ఉంది. ఇటీవల వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ఉప్పాకపాడు అండర్‌ టన్నెన్‌ నుంచి తోకలపల్లి మురుగు కాలువలోకి ఉదృతంగా ప్రవహించింది. మరోపక్క పంట కాలువలో కూడా నీరు గట్టును తాకుతూ వచ్చింది. పొలాల్లో మురుగు, అధిక నీరు తోకలపల్లి మురుగు కాలువలోకి వెళ్లేందుకు సుమారు 40 ఏళ్ల క్రితమే రైతులు ఆర్‌అండ్‌బి రోడ్డు మధ్యలో తూరలు పెట్టారు. సరిగ్గా ఈ తూరలకు ఒక పక్క తోకలపల్లి మురుగుకాలువ, మరోపక్క పంట కాలువ నీటి ప్రవాహం ఉదృతికి రోడ్డు కోతకు గురై గట్టుపై ఉన్న మట్టి మురుగు కాలులోకి కొట్టుకుపోయింది. దీంతో అక్కడ సుమారు పది మీటర్ల వ్యాసార్థంలో కోతకు గురై దారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై సంబంధిత అధికారులతో సమీక్షించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేసి, గండిని పూడ్పించేలా చర్యలు తీసుకుంటామని తహశీల్దారు రమణా రావు ప్రజాశక్తికి వివరించారు.