జమ్మలమడుగు రూరల్ : ఎపి సిఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం గండికోటకు ఒబేరారు హోటల్స్‌తో మరింతగా పర్యాటక కళ పెరగనుంది. ఈ పర్యాటక కేంద్రంలో ఆతిథ్య రంగంలో దేశంలోనే పేరెన్నిగన్న ఒబెరారు హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ ఏకంగా రూ.250 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ నిధులతో గండికోటలో 120 విల్లాలను ఆ సంస్థ నిర్మిం చనుందని ఇందుకోసం ఆ సంస్థకు అవసరమైన 50 ఎకరాలను ప్రభుత్వం 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు గండికోట పర్యాటక ప్రాంతంలో హోటల్స్ నిర్మించేందుకు అవసరమైన స్థలాలను పరిశీలించేందుకు ఇటీవలే ఒబెరారు సిఇఒ అర్జున్‌సింగ్ తన ప్రతినిధి బందంతో నాలుగు దఫాలుగా వచ్చి జిల్లా అధికారులతో కలిసి ఆయన గండికోట ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో తమ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుగుణంగా ఉన్న స్థలాన్ని అర్జున్‌సింగ్ గుర్తించగా, అదే ప్రాంతంలోని 50 ఎకరాలను ఒబెరారు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. గండికోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే ఈ లీజుకు అనుమతి ఇచ్చిందని తెలుస్తుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 7,8,9 తేదీలలో జిల్లా పర్యటన ఉండటంతో గండికోటలో ఒబేరారు హోటల్స్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. హెలికాప్టర్ దిగేందుకు హెలిప్యాడ్ ను, శంకు స్థాన చేసే ప్రాంతాన్ని పరిశీలించి అక్కడే సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో ఉన్న గండికోట గ్రామం పెన్నా నది ప్రక్కన ఉన్న అద్భుతమైన లోయకు నిలయం. గండికోట లోయను కాన్యన్ అని కూడా పిలుస్తారు. ఈ సహజ నిర్మాణం తరచుగా యుఎస్‌ఎలోని అరిజోనాలోని గ్రాండ్ కాన్యన్‌తో పోలి ఉంటుంది. రెండింటినీ పోల్చడం సరైంది కానప్పటికీ, గండికోటకు ఒక చరిత్ర ఉంది. దాని స్వంత ప్రత్యేక లక్షణాలతో ప్రజాదరణను పొందుతోది. హోటల్స్‌తోపాటు రోప్ వే పనులను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆదివారాలు, సెలవులు, పండుగల ప్రత్యేక రోజులలో గండికోట పర్యటకులతో కిక్కిరిసి పోతుంది. అలాంటి పర్యాటక ప్రాంతంలో సరైన పార్కింగ్ కానీ, టాయిలెట్స్ కానీ, ఇతర మౌలిక వసతులు లేవనేది జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రి హోదాలో గండికోటకు జగన్ మోహన్ రెడ్డి రావడం తొలి సారి. ఈ అద్భుత కోటను చూసి మరిన్ని అభివద్ధి పనులకు, గండికోట గ్రామ పంచాయితీ అభివద్ధికి వరాలు కురిపించాలని స్థానికులు కోరుతున్నారు.










