ప్రజాశక్తి -సీలేరు
డొంకరాయి పవర్ కెనాల్‌కు గండి పడిన ప్రదేశంలో కాంక్రీట్ పనులు సోమవారం రాత్రి 10 గంటల నుంచి ప్రారంభించినట్లు ఏపీ జెన్కో ఎస్‌ఈ సివిల్ కేకేవి. ప్రశాంత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మొదటిగా గండి పూడ్చివేత పనులు పూర్తి చేయడానికి గ్రావెల్‌తో మట్టి పనులు చేపట్టామని, ఈ పనులు సుమారు 20 రోజులు జరిగాయని తెలిపారు. మట్టి పనులు పూర్తి కావడంతో కాంక్రీట్ పనులు చేపట్టామన్నారు. ఇంజనీర్లు పర్యవేక్షణలో నాణ్యత లోపాలు తలెత్తకుండా నిరంతరం పరిశీలిస్తూ పనులు చేపడుతున్నామని తెలిపారు. కెనాల్ లోపల వైపు భాగం కాంక్రీట్ పనులు పూర్తి చేశామని, మరో నాలుగు రోజుల్లో కెనాల్ గండి అవుట్ సైడ్ పనులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. పవర్ కెనాల్ పనులు పూర్తయిన వెంటనే కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి డొంకరాయి, పోల్లూరు జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాగే పవర్ కెనాల్ ద్వారా నీటిని నెమ్మది నెమ్మదిగా విడిచి పెడుతూ గోదావరి డెల్టాకు 1000 నుంచి 2000 క్యూసెక్కులు నీటి విడుదల పెంచుతూ 4000 క్యూసెక్కుల వరకు నీటి విడుదల చేస్తామని తెలిపారు.










