
ప్రజాశక్తి - బట్టిప్రోలు
యునెస్కోతో కలిపి ఆర్కే ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా అందించబడే గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో ఐలవరం జెడ్‌పి ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు పచ్చారు హరికృష్ణ ఉన్నారు. మారుమూల గ్రామాలు, పట్టణాల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తూ మార్పు కోసం కృషి చేస్తున్న ఛాంపియన్లను గ్లోబల్ టీచర్ ప్రైజ్‌కు ఎంపిక చేస్తుంది. ముందుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల పనితీరును ప్రామాణికంగా తీసుకొని చేపట్టిన సర్వేలో ఇప్పటికే 50మందిని ఎంపిక చేశారు. ఆ 50మందిలో ఎపి నుండి బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం జెడ్‌పి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఉండటం అభినందనీయం. కాగా ఈ 50మందిలో మరో పదిమందితో మెరిట్ లిస్టు ఎంపిక చేసి దానిలో ఒకరిని మాత్రమే ఎంపిక చేసి ప్రైజ్ మనీగా రూ.7.35కోట్లు అందజేస్తారు. ఈ రేసులో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వేలాది దరఖాస్తుల్లో ఎంపిక ప్రక్రియ అనంతరం టాప్ 50లో ఐలవరం ఆంగ్ల ఉపాధ్యాయులు హరికృష్ణ ఉండటం విశేషం. 2005నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న హరికృష్ణ 2017లో ఐలవరం జెడ్‌పి ఉన్నత పాఠశాలకు వచ్చారు. స్వతహాగా ఇంగ్లీష్ టీచర్ అయినందున తన నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇతర దేశాల ఉపాధ్యాయులతో సామాజిక మాధ్యమాల్లో ఒక గ్రూపును ప్రారంభించి అందులో విద్యార్థులను భాగస్వాములను చేసి మంచి ఫలితాలు స్వాధీనం చేసుకుంటున్నారు. తన స్వగ్రామం మంగళగిరితోపాటు భట్టిప్రోలుకు నేడు దేశ విదేశాలలో గుర్తింపు తెచ్చారు. హెచ్‌ఎంగా పనిచేసిన కాటూరు లక్ష్మీనారాయణ ప్రోత్సాహంతో పాఠశాలలో విద్యార్థులకు స్కైప్ ద్వారా ఇప్పటికే 70దేశాలలో వందలాది పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఎప్పటికప్పుడు స్థానిక పాఠశాల విద్యార్థులను మాట్లాడిస్తున్నారు. ఉత్తర అత్యుత్తరాలతో విద్యార్థులకు ఆంగ్లభాషపై మక్కువ కలిగే విధంగా కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నూతన అంశాలు ఆసక్తికర విషయాలపై విదేశీయులతో ఇక్కడ విద్యార్థులు చర్చించడంతో ఆంగ్లభాష పట్ల భయం తొలగి నేడు విదేశీయులతో ధారాళంగా మాట్లాడగలిగే స్థాయికి విద్యార్థులను తీసుకొచ్చారు. ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా విదేశీయులు కొందరు ఇక్కడి పేద విద్యార్థులను దత్తత తీసుకొని అవసరమైన ఆర్థిక, విద్యాపరంగా సహకారాలు అందిస్తున్నారు. హరికృష్ణ చేస్తున్న కృషికి నిదర్శనంగా 2020లో అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ పర్యవేక్షించే ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్స్‌లెంట్ అండ్ అచీవ్మెంట్ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. దీంతో అమెరికాలోని అర్కన్స్ యూనివర్సిటీలో 45రోజుల ఫెలోషిప్ కూడా పూర్తి చేశారు. ఈ ఫెలోషిప్‌కు భారత్ నుండి ఆరుగురు ఎంపికగా వారిలో ఏపీ నుండి హరికృష్ణ ఒక్కరికి మాత్రమే అవకాశం లభించింది. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఆంగ్ల భాష పై మక్కువతో పాఠశాల విద్యార్థులను ఆంగ్లం వైపు ఆసక్తిని కలిగించినట్లు తెలిపారు. గ్లోబల్ టీచర్ ప్రైజ్ జాబితా 50 మందిలో తన పేరు ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. ఈ 50మందిలో హరికృష్ణ ఒక్కరే నిలవాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.