Sep 11,2023 22:03

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
          ఇంజినీరింగ్‌ విద్యార్థులు గ్లోబల్‌ ఇంజనీర్‌గా తయారు కావాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించగలరని జెఎన్‌టియు కాకినాడ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ కెవిఎస్‌జి.మురళీకృష్ణ ఇంజినీరింగ్‌ నూతన విద్యార్థులకు సూచించారు. భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్‌ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువు విజ్ఞానం పెంపొందించుకోవడమే లక్ష్యంగా సాగాలని చెప్పారు. అందుబాటులోకి వస్తున్న సెల్‌ ఫోన్‌, ఇతర మాధ్యమాలను విజ్ఞాన సముపార్జనకు మాత్రమే ఉపయోగించాలని, లేకుంటే విద్యార్థి జీవితం అంధకారమవుతుందన్నారు. ఓర్పు, సహనం, నేర్పు, స్నేహితులను, తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ సమాజంలో మంచి నడవడికను అలవర్చుకుని అందరిలో మంచివ్యక్తిగా నిలబడాలన్నారు. అహంకారం, ఎదుటివారిని హేయ భావంతో చూడటం మంచి పద్ధతి కాదని చెప్పారు. ప్రతివిద్యార్థి మతం, కులం, ప్రాంతీయతత్వం ఇలాంటి అవలక్షణాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. సాంకేతిక విప్లవంలో ప్రపంచమంతా ఒక గ్లోబల్‌ సిటీగా మారిందని, ఆ స్థాయిలోనే విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్తు ఉంటుందన్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఎన్నో వసతులున్నాయని పేర్కొన్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇన్‌స్పెక్టర్‌ వివిఎస్‌ఎన్‌.వర్మ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. వాటికి అలవాటుపడితే భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్‌వి.రంగరాజు, వైస్‌ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కెవి.మురళీకృష్ణంరాజు, డాక్టర్‌ సురేష్‌ బాబు, వివిధ విభాగాల హెడ్స్‌ పాల్గొన్నారు.