Jul 12,2021 15:01

భూగోళ క్షేత్రం మీద
అరక ఆయుధంతో
అక్షాంశాల సాలు
రేఖాంశాల ఇరువాలుతో
మట్టి పొరలను పెకిలిస్తూ
నిజ నిర్ధారణ రేఖలను గీస్తూ
అన్నదాతలై ఆకలి విత్తనాలేస్తారు

భగ భగలాడే భానుడి సెగలకో
బుస్సున పొంగే రసాయనాలకో
జీవం కోల్పోతున్న మొక్కలకు
కన్నీటి చుక్కలతో ప్రాణం పోస్తారు
బీటలు వారిన బీడు భూములకు
స్వేదబావి నీటితో తానం చేపిస్తారు

పలుగు పారతో దోస్తీ చేస్తూ
కష్టనష్టాలతో కుస్తీ చేసే యోధులు
రాజధాని నడి రోడ్డు మీద
పోరాటాల నాట్లేస్తున్నారు
కొత్త చట్టం మిఠాయి పొట్లంలా
కట్టా మీఠాల పాలెంతనో
కార్పొరేట్ల పెత్తనమెంతనో

రైతు చట్టంలో
రైతులకు మేలెంతనో
రాబందుల గోలెంతనో
కొత్త కొత్తగా వండే వంటలో
బాదం పలుకులు లేకున్నా సరే
పంటికింద రాళ్ళు తగలకుంటే చాలు

రైతును రాజును చేయకున్నా సరే
మేజాలో బూజులా దులిపేయకండి
రాయితీల కిళ్ళీలేయకున్నా సరే,
రాయెత్తి మాత్రం తరుమకండి
లాఠీలతో కొట్టినా తట్టుకుంటరు
లూటీ చేస్తేనే గలాట చేస్తారు!

గంగశ్రీ
96763 05949