ప్రజాశక్తి - వంగర : మండలంలోకి ప్రవేశించిన గజరాజులు గుంపు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వివిధ గ్రామాలలో సంచరించి చెరకు, వరి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేయడంతో పాటు పశువులపై దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. శ్రీహరిపురంలో ప్రవేశించిన ఏనుగులు భాగంపేట చేరుకొని గ్రామానికి చెందిన ఓ కుటుంబం తిండి గింజలను ధ్వంసం చేశాయి. అక్కడ నుంచి నీలయ్యవలస, జగన్నాథవలస, మడ్డువలస గ్రామ పొలాల్లో సంచరించి పంటలను ధ్వంసం చేశాయి. సంగాం చేరుకుని వరి, మొక్కజొన్న, జీడి పంటలను ధ్వంసం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగుల దాడిలో ఆవు మృతి
సంగాం గ్రామానికి చెందిన బొడ్రోతు రామినాయుడు పాడి ఆవుపై మంగళవారం అర్ధరాత్రి ఏనుగులు గుంపుగా వచ్చి దాడి చేయడంతో ఆవు మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన వావిలపల్లి జగన్నాథం నాయుడు, ఆలుబిల్లి ఈశ్వరరావులకు చెందిన ఆవులపై ఏనుగులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాయి. తమ పాడి ఆవు మృతి చెందిందని రామి నాయుడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ విషయంపై తహశీల్దార్ డి ఐజాక్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఏనుగులు దాడిలో మృతి చెందిన ఆవుకు వంగర ఇంచార్జి పశువైద్యాధికారి వేగిరెడ్డి రాము పోస్టుమార్టం నిర్వహించారు. నివేదికను ఫారెస్ట్ అధికారులకు పంపిస్తామని తెలిపారు.
మగ్గూరులో ఓ ఇంటి తలుపు తట్టిన ఏనుగు
సంగాంలో బీభత్సం సృష్టించిన ఏనుగులు గుంపు అక్కడ నుంచి దగ్గరలో ఉన్న మగ్గూరు గ్రామానికి అర్ధరాత్రి చేరుకున్నాయి. అందులో ఓ ఏనుగు గ్రామ శివారులో ఉన్న మారడాన శ్రీనుకు చెందిన ఇంటి తలుపును పెద్ద ఘీంకార శబ్దం చేసి తట్టడంతో భయభ్రాంతులకు గురై ఆ ఇంట్లో ఉన్న వారంతా బయటకు పరుగులు తీసి కేకలు వేశారు. ఇంటి పక్కనే తన శాలలో ఉన్న ఆవుపై ఏనుగు దాడి చేసిందని శ్రీను తెలిపారు. మగ్గూరులో బుధవారం సాయంత్రం వరకు సంచరించిన ఏనుగుల గుంపు అక్కడ నుంచి మండలంలోని ఓని అగ్రహారం పొలాల్లోకి చేరుకున్నాయి.
భయాందోళన చెందుతున్న ప్రజలు
పంట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు వీధుల్లోకి చొరబడి పశువులపై దాడి చేయడంతో పాటు తలుపులు తడుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం వరి పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. ఇలాంటప్పుడు ఏనుగులు పొలాల్లో సంచరిస్తుండటంతో పొలాలకు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. రహదారుల పైన కూడా రాకపోకలకు ఆటంకం కల్పిస్తున్న ఏనుగులను ఇక్కడ నుంచి పంపించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అప్రమత్తం చేస్తున్న అధికారులు
ఏనుగుల వద్దకు ప్రజలు ఎవరూ కూడా వెళ్లకుండా తహశీల్దార్ డి.ఐజాక్, ఎస్‌ఐ ఆర్ జనార్దన్‌రావు గ్రామాలలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏనుగులు కదిలికిన ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ అధికారి (ఈఎంసి) మణికంఠ, విజయనగరం ఫారెస్ట్ రేంజ్ అధికారి బి. అప్పలరాజు, బీట్ అధికారులు స్వప్న, రిషికేశ్, సత్యనారాయణ, మొత్తం 18 మంది ట్రాకర్స్, అటవీ శాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఏనుగుల వైపు ప్రజలు ఎవరూ వెళ్లి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని ప్రజలకు తెలియజేస్తున్నారు.
విద్యుత్ సరఫరా నిలిపివేత
సంగాం, మగ్గూరు గ్రామాలలో ఏనుగులు సంచరించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా గ్రామాలకు విద్యుత్ శాఖ ఏఈ వినరు కుమార్ బుధవారం కొంత సమయం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆయా గ్రామాల నుంచి ఏనుగులు కదలడంతో మరల విద్యుత్ పునరుద్ధరించారు.










