
గోతులమయంగా కాళ్ల-కోలనపల్లి రహదారి
ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు
వర్షం వస్తే అవస్థలు వర్ణనాతీతం
ప్రమాదాలు జరుగుతున్నా పట్టని అధికారులు
ప్రజాశక్తి - కాళ్ల
రహదారులు అభివృద్ధికి పట్టుకొమ్మలు అంటారు.. అలాంటి రోడ్లు పూర్తిగా పాడైపోయ్యాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టులాంటి రహదారులు అధ్వానంగా మారాయి. ఎక్కడ చూసినా... అడుగేస్తే మడుగే అనేంతలా పరిస్థితి ఉంది. అసలక్కడ రోడ్డు ఉందా అనిపించే దారులు లెక్కలేనన్ని..! రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై పాలకులు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిశాయి. గతంలో రోడ్ల మరమ్మతులకు వర్షాలు అడ్డుగా ఉన్నాయని చెప్పుకొచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ వర్షాకాలం ముంగిట బాగు చేయడానికి ఆదేశాలిచ్చింది. ఇదంతా చూస్తే.. రోడ్డు కష్టాలు కొనసాగక తప్పవని ప్రజలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ పల్లె జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్న పల్లె రహదారుల్లో అడుగుకో గొయ్యి దర్శనమిస్తోంది.
కాళ్ల - కోలనపల్లి మార్గం గుండా ప్రతిరోజు పదుల సంఖ్యలో పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఆకివీడు వెళ్లేందుకు ఈ మార్గం ప్రధానమైనది. రోడ్డు నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారాయి. గోతులమయంగా మారి ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. గత ప్రభుత్వం ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేసి మూడేళ్లు గడుస్తున్నా.. ఇంతవరకూ అతీగతీ లేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్డులో అడుగుకో గొయ్యి దర్శనమిస్తోంది. ఈ మార్గం గుండా పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలంలో వారు పడే బాధలు వర్ణనాతీతం. ఇటీవల కురిసిన వర్షాలకు గోతుల్లో నీరు చేరి వాహన చోదకులు, ప్రయాణికులు అనేక అవస్థలు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో వారు పడే బాధలు వర్ణనాతీతం. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
రోడ్డు మరమ్మతులు చేపట్టాలి
కొనకంచి సూర్యనారాయణమూర్తి, కోలనపల్లి సర్పంచి
రహదారులు పాడయ్యాయి. రోడ్డు పూర్తిగా గోతులమయంగా మారింది. కనీసం రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా పోయింది. రాత్రిపూట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కోలనపల్లి రోడ్డును అభివృద్ధి చేయాలని మండల పరిషత్ సమావేశంలో ప్రస్తావించాను. స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలి.