గజ దాడులు మళ్లీ మొదలు..
పంటలు నష్టపోతున్న రైతన్నలు
ప్రజాశక్తి - సోమల : సదుం మండలం చెరుకువారిపల్లి గ్రామపరిధిలోని పలు రైతులకు చెందిన వ్యవసాయ పంట పొలాలపై ఏనుగుల మంద దాడిచేసి తీవ్రంగా రైతులను నష్టపరిచినట్లు గ్రామస్తులు, రైతులు ఆరోపించారు. శనివారం రాత్రి ఏనుగుల మంద ఉప్పరపల్లి నుండి ఈశ్వరయ్య, బాలకష్ణ, రెడ్డమ్మ, మోహన్ అనే రైతులకు చెందిన చెరకు తోటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. విషయం తెలుసుకున్న రైతులు ఏనుగులను తరిమెందుకు టపాసులు తీసుకువెళ్లి పేల్చారు. గుంపులో నుండి రెండు ఏనుగులు రైతులు వైపు దూసుకురావడంతో రైతులు అక్కడి నుండి పరుగులు తీశారు. గంటా వారిపల్లి, గురికానివారిపల్లి గ్రామ సమీపంలో ఏనుగులు సంచరిస్తూ రైతుల పంట పొలాలను ధ్వంసం చేసి రైతులకు తీవ్రనష్టాన్ని కలిగిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల భారీ నుండి రైతుల పంట పొలాలు కాపాడేందుకు ప్రభుత్వం ఏనుగుల మందను ఈ ప్రాంతం నుండి దూరంగా తరిమివేయాలని రైతులు కోరుతున్నారు.










