Oct 08,2022 23:19

సంతకు తీసుకొచ్చిన నాగలి దుంపలు

ప్రజాశక్తి -హుకుంపేట: నాగలి దుంపలకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో కారు చౌకగా అమ్మకాలు జరిపి నష్టాల పాలు అవుతున్నామని రైతులు వాపోయారు. మండల కేంద్రంలో శనివారం వారపు సంతకు అమ్మకానికి తీసుకొచ్చిన నాగలి దుంపలను గిట్టుబాట ధర లేక పోవడంతో రైతులు నష్టపోయారు. కేజీ రూ.30 నుంచి 40 లకు కొనుగోలు చేయడంతో కనీసం రవాణా ఖర్చులు కూడా సరిపోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కిలో రూ.80 నుంచి 100లకు కొనుగోలు చేస్తే పెట్టుబడి ఖర్చులకి సరి పోయేదని రైతులు తెలిపారు. మండలంలోని మారుమూల ప్రాంతాల నుంచి గిరిజనులు పండించిన పంటలు శనివారం వారపు సంతకు అమ్మకానికి తెస్తుంటారు. రవాణా ఖర్చులకే అధికమవుతుందని రైతులు అన్నారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి ఆదుకోవాలని వారు కోరారు.