Aug 09,2023 21:58

విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి-సోమందేపల్లి : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను చట్టబద్దత చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు జి రాజగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 24వ తేదీ ఢిల్లీలో అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతుల రుణాలను మాఫీ చేయాలని, సోమనాథ కమిటీ సిఫారసు మేరకు రైతులకు పెట్టుబడితో పాటు 50 శాతం లాభదాయకంగా ఉండే విధంగా పార్లమెంట్లో చట్టం తేవాలని, మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని విరవింపజేయాలని, పట్టు రైతులకు పెండింగ్లో ఉన్న రాయితీ వెంటనే విడుదల చేయాలని, రైతులకు ఇచ్చే సబ్సిడీలను అలాగే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పాల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా రాయితీ ఇవ్వాలని రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వాలని, కేరళ పద్ధతిలో రైతులకు రుణ విముక్తి తేవాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న ఢిల్లీలో జరుగు సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు మాగే చెరువు భాస్కర్‌, రైతులు వెంకటస్వామి, దాసన్న, చేనేత కార్మిక సంఘం మండల అధ్యక్షులు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.