నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి స్వయంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన రోజునే రాష్ట్రంలో మన్యం బంద్ జరిగింది. తమ బిడ్డలను చదువుకు దూరం చేయవద్దంటూ గిరిజనులు చేసిన బంద్ విద్యాహక్కు రక్షణ కోసం మాత్రమే గాక తమ అస్తిత్వం కోసం సాగిస్తున్న పోరాటంలో సైతం భాగమే.
మన రాష్ట్రంలో ముప్ఫైకి పైగా గిరిజన తెగలు ఉన్నాయి. ప్రతీ తెగకూ స్వంత భాష ఉంది. ఆ భాషలకు లిపి లేదు. అభివృద్ధి చెందని ఆ భాషలను పరిరక్షించడం సామాజిక శాస్త్రవేత్తలకు ఒక సవాలు. కాగా ఆ తెగల లోని బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పి తక్కిన సమాజంలో భాగంగా వారిని అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత. ఆ పిల్లలకు ముందు తెలుగు భాషను అలవాటు చేసి ఆ తర్వాత తెలుగులో వారికి బోధించడం ఇన్నాళ్ళూ జరుగుతూ వచ్చింది. వారి వారి భాషల్లో వివరిస్తూ క్రమంగా తెలుగు అలవాటు చేయడానికి ఏర్పడిన ప్రత్యేక వ్యవస్థే గిరిజన భాషా వలంటీర్లు. తమ తోటి గిరిజనులకు విద్యాబుద్ధులు గరిపే కీలకమైన కృషిలో వీరంతా ఉన్నారు. కాని ప్రభుత్వం వీరిపట్ల క్షమించరాని నిర్లక్ష్యం వహిస్తోంది. సంవత్సరాల తరబడి ఎటువంటి జీతభత్యాలూ చెల్లించకుండా, వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించకుండా కాలయాపన చేస్తోంది.
మాతృభాష లోనే విద్యాబోధనకు తొలి అడుగులు పడతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. కాని ఆ ప్రాథమిక విషయం మన ముఖ్యమంత్రి గుర్తించడానికి తిరస్కరిస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్పాలని ఆదేశించారు. ఆ వివాదం మాట ఎలా ఉన్నా, ఇప్పుడు గిరిజన బిడ్డలకు తెలుగు, ఇంగ్లీషు రెండూ మాతృభాషలు కావు. ఈ రెంటిలో ఏభాషలో వారికి చదువు నేర్పాలన్నా ముందు వారి మాతృభాష తోనే మొదలుబెట్టాలి. అందుకు భాషా వలంటీర్లు ఉండడం అవశ్యం. కాని మన ఘనత వహించిన విద్యాశాఖాధికారులకు ఈ మౌలిక సత్యం ఎందుకు బోధపడడం లేదో తెలియదు. గత మూడు దశాబ్దాలుగా గిరిజన ప్రాంతంలో ఎంతో కొంత మేరకు అక్షరాస్యత పెరిగిందంటే దాని వెనుక ఈ భాషా వలంటీర్లదే కీలక పాత్ర. గిరిజన బిడ్డలచేత విద్యా సముపార్జన దిశగా తొలి అడుగులు వేయించే ఈ భాషా వలంటీర్ల వ్యవస్థను పట్టించుకోకపోవడమే గాక, ఈ విద్యా సంవత్సరం వారి సేవలను కొనసాగించేందుకు ఆదేశాలను సైతం జారీ చేయడానికి ప్రభుత్వం నిరాకరించడం సిగ్గుచేటు.
ప్రజలంతా విద్యావంతులు కావాలంటే గ్రాంథిక భాష వద్దని, వాడుక భాషే ముద్దని గిడుగు, గురజాడ, కందుకూరి తదితర సంస్కర్తలు ఉద్యమం చేపట్టారు. ఆ కాలంలోనే గిడుగు సవరభాషా పదకోశాన్ని రచించి, సవర భాషకు లిపిని రూపొందించారు. కోయ భాష విషయంలోనూ కొంత కృషి జరిగింది. దేశ వ్యాప్త అక్షరాస్యతా ఉద్యమంలో భాగంగా గిరిజన విద్యా వికాస కేంద్రాలు వచ్చాయి. ఆ తర్వాత భాషా వలంటీర్లు వచ్చారు. కాని విద్యారంగం కార్పొరేటీకరణకు గురవడంతో ఈ తరహా కృషికి గ్రహణం పట్టింది. గిరిజన ప్రాంతంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేవరకైనా భాషా వలంటీర్లను కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. కాని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తోంది.
అటు శ్రీకాకుళం జిల్లా మొదలుకుని ఇటు ప.గో. జిల్లా దాకా విస్తరించివున్న గిరిజనం ఆశలను నీరుగార్చింది జగన్ ప్రభుత్వం. పోలవరం నిర్వాసితులను నిర్దాక్షిణ్యంగా ముంపుకు వదిలేసింది. జీవో నెం.3 విషయంలో గాని, నాన్‌షెెడ్యూల్డ్ మండలాల విషయంలో గాని ముందడుగు పడనేలేదు. అటవీ హక్కుల చట్టాన్ని, అటవీ సంరక్షణ చట్టాన్ని తన మోనిటైజేషన్ దురాశకు బలిచేస్తున్న కేంద్ర ప్రభుత్వపు దుశ్చర్యల మీద రాష్ట్ర ప్రభుత్వం నోరెత్తడం లేదు. గిరిజన యూనివర్సిటీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పాఠశాలల విలీనానికి జారీ చేసిన తాజా జీవో ఫలితంగా గిరిజన ప్రాంతంలో వందలాది ప్రాథమిక పాఠశాలలు మూతబడనున్నాయి. భాషా వలంటీర్లను కొనసాగించడానికి నిరాకరించడం గిరిజనులవిద్య పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇందుకు నిరసనగా తాజాగా నిర్వహించిన మన్యం బంద్‌లో వ్యక్తమైన గిరిజనుల ప్రతిస్పందన చూసైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. వెంటనే నూతన విద్యా విధానపు చట్రాన్ని విడిచిపెట్టి సమగ్రమైన గిరిజన విద్యాభివృద్ధి విధానాన్ని రూపొందించి అమలుకు పూనుకోవాలి. భాషా వలంటీర్ల వ్యవస్థను బలోపేతం చేసి కొనసాగించాలి.










