ప్రజాశక్తి పాడేరు: కొమరం భీమ్, ఎస్‌ఆర్ శంకరన్ స్ఫూర్తితో గిరిజన హక్కులు, చట్టాల ఉల్లంఘనపై ఉద్యమం చేయాలని గిరిజనులకు గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి అప్పలనరస పిలుపునిచ్చారు. ఐటిడిఏ కాఫీ హౌస్ లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొమరం భీమ్, ఎస్‌ఆర్ శంకరన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విరోచితమైన పోరాటం నిర్వహించి గిరిజన ప్రజానీకానికి స్వయంపాలన కావాలని నినదించిన గొప్ప వ్యక్తి కొమరం భీమ్ అని అన్నారు. ఇటువంటి నాయకులు ఆదివాసులకు స్ఫూర్తి ప్రదాతలన్నారు. గిరిజనులకు స్వయం పాలన కావాలని ఆకాంక్షించిన ఉద్యమ నేత అన్నారు. ఆదివాసి ప్రాంతంలో కార్పొరేట్ మైనింగ్ కంపెనీల పెత్తనం రోజు రోజుకీ పెంచడం కోసం మోడీ, జగన్ ప్రభుత్వాలు విచ్చలవిడిగా గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘించి సహజ సంపదను దోచి పెడుతున్నాయని విమర్శించారు. త్రిపుర రాష్ట్రంలో గిరిజన స్వయంపాలన కౌన్సిల్ ఏర్పాటులో కీలకమైన రూల్స్ రెగ్యులేషన్ రూపొందించడంలో నాటి ఐఏఎస్ ఆఫీసర్ ఎస్సార్ శంకరన్ చాలా గొప్ప కృషి చేశారన్నారు. ఆదివాసుల హక్కులు, చట్టాల రక్షణకు చేశారన్నారు. నేటి ఐఏఎస్ ఆఫీసర్లలో చిత్తశుద్ధి కొరవడి గిరిజనులకు వ్యతిరేకులుగా మారుతున్నారన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో 100శాతం రిజర్వేషన్ అమలు అయ్యేదని, పాలకుల కుట్రపూరిత విధానంతో జీవో నెంబర్ 3 రిజర్వేషన్ రద్దు చేసినా కనీసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కే నర్సయ్య, చిట్టిబాబు, కుమారి, నాయుడు పాల్గొన్నారు.










