Aug 09,2023 22:10

గుమ్మలక్ష్మీపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు, గిరిజనులు

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నూతన చట్టాలను తీసుకొచ్చి ఆదివాసీల జీవన విధానంపై తీవ్ర దాడి చేస్తోందని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ కోలక అవినాష్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యాన భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం వైటిసిలో సమావేశం నిర్వహించారు. ప్రయివేట్‌ కంపెనీలకు ఇష్టారాజ్యాంగ అనుమతులు ఇస్తూ తరతరాల నుంచి అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులను బాక్సైట్‌ తవ్వకాల పేరుతో దూరం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులకు వెన్నెముకగా ఉన్న జిఒ 3 రద్దు చేసి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిందన్నారు. 1/70 చట్టం పకడ్బందీగా అమలు చేయడం లేదన్నారు. గిరిజన అభివృద్ధి కోసం ఏర్పడ్డ ఐటిడిఎ, జిసిసిలకు నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందన్నారు. అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం, ఉపాధి హామీ చట్టాలను ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఏజెన్సీలో 16 ఏళ్లుగా ఏనుగులు సంచరిస్తున్నా, వాటిని తరలించడంలో స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపడం లేదన్నారు. బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ గిరిజన అభివృద్ధి కోసం ఏర్పడిన ఐటిడిఎలు రాజకీయ వేదిక మారాయని మండిపడ్డారు. ఆదివాసీ ఉత్సవాల సందర్భంగా పలు పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో వేదిక నాయకులు మండంగి రమణ, ఇంటికొప్పల గౌరీ శంకర్‌, రోబ్బ లోవ రాజు, తోట రమేష్‌, కడ్రక మల్లేశ్వరరావు, పాలక క్రాంతికుమార్‌, అడ్డాకుల చిన్నారావు, తాడంగి దమయంతి, కూరంగి సీతారాం, పువ్వల సత్యనారాయణ, పత్తిక శంకర్రావు, పత్తిక ప్రసాదరావు, బిడ్డిక కూర్మారావు పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్‌ : ములగ పంచాయతీ లచ్చన్నదొరవలసలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.రామస్వామి మాట్లాడుతూ అడవి నుండి గిరిజనులను దూరం చేయడానికి ప్రభుత్వం కుట్రపన్నుతోందన్నారు. దీన్ని తిప్పికొట్టాలని గిరిజనులను కోరారు.
సాలూరు రూరల్‌ : తరతరాలుగా ప్రభుత్వాలు గిరిజనులను మోసం చేస్తున్నాయని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సీదరపు అప్పారావు అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గేమ్మీల జానకిరావు అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. అనంతరం దండిగాం రోడ్‌లో సిఐటియు కార్యాలయంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్న గిరిజన శాఖ మంత్రి కనీసం వ్యతిరేక చట్టాలపై మౌనం వహించడం దారుణమన్నారు. మణిపూర్లో అల్లర్లకు కారణమైన వారందరినీ చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జన్ని రామయ్య, మంచాల శ్రీనివాసరావు, గూడెపు పోలిరాజు, మెల్లిక అయోధ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె.రమేష్‌, పి.వెంకటస్వామి, ఎస్‌.పారయ్య, డి.నాని, సిఐటియు నాయకులు ఎన్‌వై నాయుడు ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తాడంగి గాసి, మర్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ : ఆదివాసీ హక్కులను కాపాడుకొనేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఊయక వెంకటేష్‌, ఊయక రామస్వామి కోరారు. అంటివలస గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడారు, ఆది, రాము, వెంకటేష్‌, సుబ్బారావు, అనిల్‌, రాజేష్‌, మధు పాల్గొన్నారు.