
ప్రజాశక్తి- కోటవురట్ల:గిరిపుత్రుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు తగదని, తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు గడ్డం బుజ్జి డిమాండ్ చేశారు. అణుకు గిరిజనులు 38 రోజులుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు ఆదివారం ఆయన శిబిరం వద్దకు చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 38 రోజులుగా దీక్ష చేపడుతున్నా ప్రభుత్వం గిరిజనులను పట్టించుకోక పోవడం సరికాదన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు కంటితుడుపు చర్యగా హామీలు ఇచ్చి నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డేవిడ్‌రాజు, జనసేన నాయకులు రాంబాబు, ఏసుబాబు, బండి రాజు, పలువురు గిరిజనులు పాల్గొన్నారు.