Nov 15,2022 23:53

నేత్ర పరీక్షలు చేస్తున్న ఎల్‌వి.ప్రసాద్‌ ఆసుపత్రి వైద్యులు

ప్రజాశక్తి- సీలేరు
ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆధ్వర్యంలో జీకే వీధి మండలం దారకొండలో మంగళవారం నిర్వహించిన వైద్య శిబిరం గిరిజనులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అన్ని వ్యాధులకు సంబంధించిన వైద్య నిపుణులు శిబిరంలో పాల్గొంటారని ముందస్తుగా ప్రచారం విస్తృతంగా చేసినప్పటికీ ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి నుంచి నేత్ర వైద్య నిపుణులు మాత్రమే రావడంతో గిరిజనులు కంగుతిన్నారు. వైద్య శిబిరంలో వైద్య సేవలు పొందవచ్చని ఎంతో ఆశగా సుదూర మారుమూల ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చిన గిరిజనులకు ప్రయాసే మిగిలింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
150 మంది నేత్ర పరీక్షలు
ఈ శిబిరంలో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 20 మందిని ఆపరేషన్లు నిమిత్తం విశాఖపట్నం ఎల్వి ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి రిఫరల్‌ చేశారు. దారకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారి నాగభూషణం రోగులకు వివిధ వైద్య పరీక్ష నిర్వహించారు. వైద్య శిబిరంలో కంటి వైద్య నిపుణులు వెంకటరమణ, లతా, మానస, శ్రావణి, లోకేష్‌ టీం కోఆర్డినేటర్‌ స్వాములు ఫీల్డ్‌ ఆఫీసర్లు సత్యనారాయణ గాంధీ సంతోషి, స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.