Jun 07,2023 23:52

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు : జనన ధృవీకరణ పత్రాల జారీకి నోటరీ చేయాలని గిరిజనులను ఇబ్బందులు పెడితే రెవెన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌: హెచ్చరించారు. కలెక్టర్‌ కార్యాలయపు వీడియో సమావేశ మందిరం నుండి పాడేరు, రంప చోడవరం డివిజన్ల పరిధిలోని సర్వే అధికారులు, తహశీల్దారులు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహంచారు. జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో చేపట్టిన భూముల రీ సర్వే, పివిటిజి ఓటర్ల నమోదు, ఫారం 7, ఫారం 6 సేకరణ, ఎస్సైన్మెంటు భూముల గుర్తింపు, కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవ పత్రాల జారీ, ఫిర్యాదుల పరిష్కారాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వారం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. విఆర్‌ఓలు, గ్రామ సర్వేయర్లు డేటా ఎంట్రీ పూర్తి చేసి గ్రామ సభలు నిర్వహించి రైతుల నుండి అభ్యంతరాలను స్వీకరించాలని స్పష్టం చేసారు. తహశీల్దారులు విఆర్‌ఓలతో సమావేశాలు నిర్వహించి నిర్దేశించిన గడువులోపు డేటా ఎంట్రీ పూర్తి చేయించా లన్నారు. ఎస్సైన్మెంట్‌ భూముల సేకరణ వేగంగా పూర్తి చేయాలని చెప్పారు.
విఆర్‌ఒల గైర్హాజరు పై ఆగ్రహం
గ్రామ సచివాలయాల సందర్శించినపుడు విఆర్‌ఓలు సక్రమంగా హాజరు కావడం లేదని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతీ రోజు విఆర్‌ ఓలు సచివాలయాలకు రాకపోతే డ్యూటీ సర్టిఫికేట్లు జారీ చేయకూడదని తహశీల్దారులకు సూచించారు. కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ లబ్దిదారులు తిరగ కూడదన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జె.శివ శ్రీనివాసు, రంపచోడవం పి.ఓ సూరజ్‌ గనోరే, ట్రైనీ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ, డిఆర్‌ఓ పి. అంబేద్కర్‌, సర్వే సహాయ సంచాలకులు వై.మోహన రావు, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే నాగేశ్వరరావు, తహశీల్దారులు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.