Nov 05,2022 23:48

ఆసుపత్రికి తరలిస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి -కొత్తకోట: చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఎంతో అట్టహసంగా దత్తత తీసుకున్న చలిసింగం గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం లేక డోలి మోతలు తప్పడం లేదు. శనివారం గ్రామానికి చెందిన చీపురు సత్తిబాబుకు ప్రమాదవ శాత్తు కాలికి గాయమైంది. నడవ లేని స్థితిలో ఉన్న సత్తిబాబును డోలీలో కొత్తకోట ఆసుపత్రికి తరలించారు.గ్రామంలో ఎవ్వరికి ఆరోగ్యం బాగో లేక పోయినా సుమారు మూడు కిలోమీటర్లు దూరం కొండ పై నుండి కిందకు, దిగువ నుంచి కొండ పైకి మోసుకు పోవాల్సిందే. గత నెలలో గ్రామానికి చెందిన కిముడు చంటిబాబు అనారోగ్యంతో మృతి చెందాడు. డోలిలో మోసుకు వెళ్తుండగా సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ కెజి హెచ్‌లో మీతి చెందిన మరో యువకుడు మృతదేహాన్ని కొండ దిగువ సికాయిపాడు గ్రామం నుంచి డోలి మోతలో గ్రామానికి అతికష్టంపై తరలించారు. ఈ గిరిజన గ్రామంలో సుమారు 500 మంది జనాభా కలిగి ఉన్నారు. వీరికి కనీస మౌళిక సదుపాయాలైన రహదారి, తాగు నీరు, మురుగు నీటి కాలువలు లేవు. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీ లకు చెందిన నేతలు సదుపాయాలు కల్పిస్తామని నమ్మించి తర్వాత మరిచి పోతారని గిరిజనులు ఆరోపించారు.ఈ నెల 15 న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద డోలీలతో నిరసన చేపట్టనున్నట్టు గిరిజన సంఘం నాయకులు శంకరరావు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు స్పష్టం చేశారు...