Jun 17,2023 00:22

రేషన్‌ సరుకులు మోసుకెళ్తున్న మహిళలు

ప్రజాశక్తి-హుకుంపేట:రహదారి సౌకర్యం లేక గిరిజనులు కాలిబాటన రేషన్‌ సరుకులు మోసు కుంటున్నారు. ప్రభుత్వాలు మారినా రహదారి సౌకర్యం లేక గిరిజనులకు కష్టాలు తప్పలేదు. మండలంలోని తీగలవలస పంచాయతి పనసభంద, కిన్నెరలోవ గ్రామ ప్రజలు శుక్రవారం తీగలవలస డిపో నుంచి పనసభంద గ్రామం వరకు రేషన్‌ సరుకులను మహిళలు గాడిదలపై మోసుకుని ఘాటి ఎక్కారు. గిరిజనులు మండుటెండలో కష్టాలు పడుతూ ఘాటీలో ప్రయాణం చేశారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో తమ గ్రామానికి రేషన్‌ సరుకుల వాహనం రాక పోవడంతో లబ్ధిదారులే మండుటెండలో నెత్తి మీద మూటలు మోసుకుంటూ ప్రతినెలా రాకపోకలు సాగిస్తున్నారు.
ప్రభుత్వం ఇంటి వద్దకు రేషన్‌ సరుకులు పంపిణీ అంటూ ప్రకటనలు వరకు పరిమితం అవుతుంది. తప్ప మారుమూల గ్రామంలో మాత్రం పూర్తి స్థాయిలో అమలు కాలేదని పనసభంద గ్రామ ప్రజలు వాపోతున్నారు. రహదారి సౌకర్యం కోసం పలుమార్లు సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేసినప్పటికీ స్పందించి అధికారులు రహదారి మంజూరు చేసినప్పటికీ పనులు మాత్రం నత్త నడకగా సాగుతున్నాయి. పనులు చేపడుతూ మధ్యలో ఆపివేయడంతో వర్షానికి కోతకు గురై రాకపోకలకు వీలు లేకుండా అధ్వానంగా మారింది. అధికారులు రహదారి సౌకర్యం కల్పించి రేషన్‌ సరుకులకు ఇంటింటికీ పంపిణీ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.