ప్రజాశక్తి - కొమరాడ : తనకు అవకాశం ఉన్న ప్రతిసారి గిరిజనులు, పేదలకు ఏదో ఒక రూపంలో సేవ చేస్తూ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జగన్మోహన్రావు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. గిరిశిఖర గ్రామంలోని గిరిజనులకు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు తన కుమారుడు యువాన్ పుట్టినరోజు సందర్భంగా దుప్పట్లు, నిత్యవసర సరుకులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ కుటుంబాలకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. చిన్న పిల్లలకు బిస్కట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎంతోమంది అనాథలకు, ఆపన్నులకు, మనం చేసే కొద్ది సేవ కూడా ఆదుకొనే అవకాశాలు ఉన్నాయని, ఉపాధికరువై, అన్న వస్త్రాలు సైతం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, అలాంటి వారికి ఏచిన్న సాయం అందినా దానికి ప్రయోజనం ఉంటుందన్నారు. అనంతరం గ్రామస్తులు అభినందిస్తూ అతని కుమారునికి ఆశీస్సులు తెలిపారు. కార్యక్రమంలో రాఘవేంద్ర రావు, రమేష్ బాబు,జయగౌడ్, బి.వి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.










